దొరవారిసత్రం : మండలంలోని అక్కరపాక వద్ద శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై వెళుతున్న లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుకే వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో ఆటోలో వస్తున్న శివ, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. ఏకొల్లు గ్రామానికి చెందిన శివ, నాగరాజు ఆటోలో సూళ్లూరుపేటకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గడ్డివాముకు నిప్పు
సూళ్లూరుపేట రూరల్ : మండలంలోని దామానెల్లూరులో బట్ట బంగారయ్య అలియాస్ సుకుమార్ అనే వ్యక్తి గడ్డివాముకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికుల భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారి డి. హరిష్, సిబ్బంది రామ్మూర్తి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పకడ్బందీగా కార్డన్ సెర్చ్
తిరుపతి క్రైం : విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పకడ్బందీగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈస్ట్, వెస్ట్, అలిపిరి, తిరుపతి రూరల్, వడమాలపేట పోలీస్ స్టేషన్‌ల పరిధిలో తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల వివరాలు పరిశీలించారు. రౌడీ షీటర్లు, నేర చరితులు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశమున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.
వార్డుల విభజనకు నోటిఫికేషన్
వెంకటగిరి రూరల్ : పురపాలక పరిధిలో వార్డుల విభజనకు నోటిఫికేషన్ విడుదలైనట్లు మున్సిపల్ కమిషనర్ కిరణ్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయని, విభజన తర్వాత 36 వార్డులుగా పెరగనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్‌రిజిసా్‌ట్రర్ కార్యాలయాల వద్ద నోటిఫికేషన్ ప్రతులను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 24వ తేదీలోపు తెలియజేయవచ్చని వివరించారు. అయితే వార్డుల విభజన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ఆటో బోల్తా : ఆరుగురికి గాయాలు
పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై శనివారం రాత్రి గుర్రపుతోట వద్ద ఆటో బోల్తా పడడంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి ప్రయాణికులతో వెళుతున్న ఆటో అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. హైవే అంబులెన్స్‌లో క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన చిల్లకూరుకు చెందిన పాస్టర్ ప్రభాకర్‌ను మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన ఆటోను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


