అడ్డగించి.. అంటగట్టి! | - | Sakshi
Sakshi News home page

అడ్డగించి.. అంటగట్టి!

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

● శ్రీకాళహస్తిలో ముక్కంటి భక్తులకు ‘నామం’ ● ఆధ్యాత్మికత పేరుతో యథేచ్ఛగా దోపిడీ ● అడుగడుగునా వసూళ్ల పర్వం

శ్రీకాళహస్తి: దక్షిణకై లాసంగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. రాహు–కేతు దోష నివారణ పూజల కోసం వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆలయ ఆవరణలో అడుగు పెట్టిన క్షణం నుంచి వివిధ రూపాల్లో భక్తులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

దుకాణదారుల ఇష్టారాజ్యం

భిక్షాల గోపురం, మూడో గేటు సెంట్రల్‌ టికెట్‌ కౌంటర్‌, నాలుగో గేటు పరిసరాల్లో కొందరు షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తులను అడ్డగించి పూజా సామగ్రి పేరుతో అధిక ధరలకు కొబ్బరికాయలు, పసుపు దారాలు, దీపాలు అంటగడుతున్నారు. ఈ దీపం వెలిగిస్తే దోషం తొలుగుతుంది, ఈ దారం చెట్టుకు కట్టాలి, ఈ కొబ్బరికాయను ఆంజనేయస్వామికి కొట్టాలి అంటూ నమ్మించి అవసరం లేని వస్తువులను అధిక రేట్లకు కొనిపిస్తున్నారని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లేనిపోనివి సృష్టించి..

మూడు, నాలుగో గేట్ల వద్ద భక్తులను కొందరు వ్యక్తులు అడ్డగించి నామం పెట్టించుకునే ఆలయంలోకి వెళ్లాలని అంటూ తీవ్రంగా ఒత్తిడి చేసి మరీ నగదు వసూలు చేస్తున్నారు. అలాగే రాహు–కేతు పూజల కోసం వచ్చే భక్తుల భయాలను ఆసరాగా చేసుకుని లేనిపోని సంప్రదాయాలను సృష్టించి కాసులు మూటగట్టుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భిక్షాల గోపురం ద్వారా వచ్చే భక్తులతో మొదటి గేటు సమీపంలోని చెట్లకు పసుపు దారాలు కట్టిస్తుండగా, మరికొందరిని చిన్న చిన్న గుడుల వద్ద దీపాలు పెట్టించి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రెండో గేటు ఎదురుగా రామాలయం వద్ద ఆంజనేయస్వామి దగ్గర టెంకాయ కొట్టి దండం పెట్టుకుని వెళ్లాలని నమ్మించి నగదు వసూలు చేస్తున్నారని వెల్లడిస్తున్నారు.

పుస్తకాలు కొనాల్సిందే..

పుస్తకాలు విక్రేతలు కూడా భక్తులను బలవంతంగా ఆపి పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్క బుక్‌ అయినా తీసుకోవాల్సిందే అంటూ భక్తుల వెంటపడి వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చూసీ చూడనట్టే..

రాహు–కేతు మండపాల్లో దక్షిణ వసూలు ఆగడం లేదు. అలాగే ఇలాంటి చిన్న చిన్న దోపిడీ వ్యవహారాలన్నీ ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి తెలియనివి కావని భక్తులు ఆరోపిస్తురు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్లముందే జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదంటే అక్రమ వసూళ్లలో వాటాలు అందుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ అండదండలతో ఈ దందా సాగుతోందా అని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.

విజిలెన్స్‌ అవసరం

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వచ్చేవారు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అక్రమ వసూళ్లను అరికట్టేందుకు విజిలెన్స్‌ సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement