చెరువుకు గండి కొట్టేశారు!
చిట్టమూరు: రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చెరువుకు గండి కొట్టేశారు. దీంతో ఆ చెరువు ఆయకట్టులో పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. వివరాల్లోకి వెళితే.. చిట్టమూరు మండలం యాకసిరి చెరువుకు సమీపంలో సాగరమాల రహదారి నిర్మాణం జరుగుతుండడంతో ఆ ప్రాంతంలో భూములకు మంచి విలువ వచ్చింది. దీంతో మండల స్థాయి నాయకులు తిరుపతికి చెందిన ఓ వ్యక్తితో కలసి చెరువుకు ఆనుకుని 80 ఎకరాల్లో సాగరమాల–2 అనే పేరుతో వెంచర్ వేసి, దానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ఇక్కడ సర్వే నంబర్18లోని చెరువు పొరంబోకు కింద ఉన్న సుమారు 40 ఎకరాలను పేద రైతులు సాగు చేసుకుంటుండగా స్థానిక నాయకుల ద్వారా వాటిని కొనుగోలు చేసుకుని పట్టా భూమిలో కలుపుకుని ఏడాది క్రితం వెంచర్ వేశారు. అయితే ఈ ఏడాది భారీగా వర్షాలు కురవడంతో చెరువుకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో వెంచర్‌కు నిర్మించి ప్రహరీ గోడ ఎక్కడ కూలి పోతుందోనని రాత్రికి రాత్రి యంత్రాలతో సుమారు 20 అడుగుల మేర రెండు చోట్ల చెరువుకు గండి కొట్టారు. చెరువుకు గండి కొట్టడంతో నీరు వృథాగా దిగువకు పోతుంది. దీంతో చెరువు ఆయకట్టు కింద సాగు చేసే సుమారు 2, 500 ఎకరాలకు ఈ ఏడాది పంట పండకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గండి కొట్టిన ప్రాంతాన్ని రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు కింద సుమారు 2,500 ఎకరాల వరకు వరి సాగు చేస్తారని, అలాంటి చెరువుకు గండి కొట్టి నీరంతా వృథాగా దిగువకు పోవడంతో రైతులు ఈ ఏడాది పంట పూర్తి స్థాయి పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని అన్నారు.
చెరువుకు గండి కొట్టేశారు!


