ఇండిగో రద్దుతో పెరిగిన విమాన టికెట్ల ధరలు
రేణిగుంట: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కావడంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. పలు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తున్న 12 విమానాల్లో పది సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్, ముంబై వంటి మహానగరాలకు వెళ్లేందుకు ముందస్తు ప్రణాళికతో టికెట్లు బుక్ చేసుకుని శుక్రవారం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు ఇండిగో సర్వీసులు రద్దు అయ్యాయని తెలియడంతో అసహనానికి గురై ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కాగా తిరుపతి నుంచి అత్యధికంగా ప్రయాణికులను చేరవేసే ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ఇదే అదునుగా ఇతర విమాన సర్వీసులు తమ టికెట్లు ధరలను అమాంతం పెంచాయి. సాధారణంగా తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఛార్జీ కాగా, శుక్రవారం ఒక టికెట్ ధర రూ.20వేలకు పైగా పెంచారు.


