తిరుపతి తుడా: మత్తుకు బానిసలుగా మారిన వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలను ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్నట్లు ఐజీ రవికృష్ణ తెలిపారు. బుధవారం తిరుపతిలోని రుయా ఆస్పత్రి ఆధ్వర్యంలో మానసిక విభాగం, మత్తు వ్యసన నిర్మూలన కేంద్రాన్ని ఎస్పీ సుబ్బ రాయుడు, రుయా ఆస్పత్రి సూపరిండెంట్ రాధ, ఆర్‌ఎంఓ డాక్టర్ హరికృష్ణలతో కలసి ఆయన సందర్శించారు. అక్కడ చికిత్సపొందుతున్న వారితో మాట్లాడారు. వారికి అవసరమైన వసతుల గురించి తెలుసుకున్నారు. ఐజీ మాట్లాడుతూ 60 బెడ్ల హాస్పిటల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో ఈ సెంటర్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు వివరించారు. మత్తుకు బానిసైన వారి మానసిక స్థితిని మార్పు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ మత్తుకు అలవాటు పడితే ఆరోగ్య సమస్యలతోపాటు కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. వైద్యులు పద్మావతి, మానస, మురళి పాల్గొన్నారు.


