
నకిలీ టీసీ అరెస్టు
తిరుపతి క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా నటిస్తూ టికెట్ లేని ప్రయాణికులు మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ టీసీని అరెస్టు చేసినట్లు రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైన్నెకి చెందిన జితేందర్‌షా కొంతకాలంగా రైల్వేస్టేషన్‌లో నకిలీ టికెట్ కలెక్టర్‌గా చలామణి అవుతున్నాడు. రైల్వేస్టేషన్‌లో రైలు దిగిన ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారిని టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి రూ.వెయ్యి జరిమానా విధిస్తూ దోచేసేవాడు. ఈ క్రమంలో సోమవారం ఓ ప్రయాణికుడితో గొడవ పడుతుండగా పోలీసులు గమనించారు. ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నించగా ప్రయాణికుడు సార్ టికెట్ లేదని రూ.500 చెల్లించాలని, రసీదు ఇవ్వకుండా మరో రూ.500 చెల్లించాలని బెదిరిస్తున్నాడని తెలిపారు. నకిలీ టికెట్ కలెక్టర్‌ను ఆధారాలు చూపించమని పోలీసులు అతడిని ప్రశ్నించగా.. ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అయితే తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, తాను పొట్టకూటి కోసం మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. అతని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.