
శ్రీకాళహస్తీశ్వరునికి బంగారు తొడుగు, రుద్రాక్షలు అందజేత
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామికి బి.కొత్తకోటకు చెందిన ఉషారాణి దంపతులు మంగళవారం రూ.3 లక్షలు విలువ చేసే 25 గ్రామలు బంగారు తొడుగు రుద్రాక్ష మాలను అందజేశారు. వీటిని ఈఓ బాపిరెడ్డి స్వీకరించి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలకు ఈఓ స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారికి ఆశీర్వవచనం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
మాయమాటలతో మహిళ చైన్ అపహరణ
తిరుపతి క్రైమ్: నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద మామిడి ఆకులు విక్రయిస్తున్న మహిళలను గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలతో మోసం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. వెదురుకుప్పం గ్రామానికి చెందిన కళావతి దీపావళి పండగ సందర్భంగా తిరుపతిలోని కూరగాయల మార్కెట్ వద్ద మామిడి ఆకులు విక్రయించేందుకు తిరుపతికి వచ్చింది. ఇదే క్రమంలో గుర్తు తెలియని మహిళ ఆమె వద్దకు వచ్చి, మన వద్ద ఉన్న నగలను జాగ్రత్తగా ఉంచుకోవాలని మొదటగా నమ్మించింది. పక్కకు పిలిచి ఆ నగలను చేతికి తీసుకుని మూట కట్టుకోవాలని తెలిపింది. లేదంటే మూట కూడా వద్దని పేపర్‌లో చుట్టుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న నకిలీ చైన్‌ను కళావతికి పేపర్‌లో చుట్టి ఇచ్చి ఆమె బంగారు చేన్‌తో ఉడాయించింది. ఆమె తేరుకుని పరిశీలించగా తాను మోసపోయామని తెలుసుకుంది. ఈ విషయమై బాధితురాలుతన 16 గ్రాములు చేన్ చోరీ జరిగినట్లు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈస్ట్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి ఆఫర్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఈ నెల 18 నుంచి నవంబరు 18వ తేదీ వరకు వివిధ ఆఫర్లను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించినట్లు జీఎం సి.అమరేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రూపాయికే సిమ్‌కార్డుతో పాటు 30రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ ఇంటర్నెట్, 100ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయని తెలిపారు. ఏదేని కార్పొరేట్ కస్టమర్ కనిష్టంగా పది అంతకుమించి పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్నా, ఒక ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్ తీసుకున్నా వారికి మొదటి నెల రీచార్జ్‌పై 10శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా మిత్రులకు, కుటుంబ సభ్యులకు రీచార్జ్ చేస్తే, రీచార్జ్ మొత్తంలో 2.5శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. దీపావళి సందర్భంగా సీనియర్ సిటిజన్లకు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.1,812కే సిమ్‌కార్డుతో పాటు 365 రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100ఎస్‌ఎంఎస్‌లు, 6నెలల పాటు బైటీవీ సబ్‌స్క్రిప్షన్ అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.485, రూ.1,999 ప్లాన్లపై బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసిన వారికి 5శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.