
అమరుల సేవలు చిరస్మరణీయం
తిరుపతి క్రైమ్: అమర వీరుల సేవలు చిరస్మరణీయమని, వారి సేవలు స్మరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి హాజరై, పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు రాకుండా సమాజాన్ని కాపాడుతూ, ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం మన అందరి బాధ్యతని, పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు సమాజాన్ని కాపాడడంలో ముందుంటూ, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గత ఏడాది 191 మంది పోలీసు సిబ్బంది దేశ సేవలో ప్రాణత్యాగం చేశారని, అందులో మన రాష్ట్రానికి చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని తెలిపారు. పోలీసు సిబ్బంది కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, వారి త్యాగాలకు మనమంతా జోహార్లు అర్పించాల అన్నారు. ‘దేశ సేవలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు వృథా కావని, రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీసు సిబ్బంది సహా దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన 191 మంది అమరవీరుల కుటుంబాలకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నానన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకునే పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం మన దేశానికి గర్వకారణమైన రోజని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది తమ కర్తవ్య నిష్ఠను, త్యాగాన్ని స్మరించుకుంటూ, ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకాలను గౌరవంగా తలచుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, దేశ సరిహద్దు భద్రత, అంతర్రాష్ట్ర నేరాలు, టెరర్రిజం, నక్సలిజం నిర్మూలన, అంతర్గత ముప్పులను ఎదుర్కొనడంలో అనేక మంది భద్రతా దళాలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి కర్తవ్యనిబద్ధత, ధైర్యం, త్యాగం ఫలితంగానే ఈ రోజు మనం శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ‘పోలీసు సేవ అనేది కేవలం ఉద్యోగం కాదని, అది ఒక మహత్తరమైన బాధ్యత అన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.