
జర్నలిస్టు కాలనీలో దొంగలు పడ్డారు..!
విద్యుత్ మోటార్లు, విలువైన వస్తువుల చోరీ గుట్టుగా చోరీ చేస్తుండగా గుర్తించిన స్థానికులు దాక్కున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగింత
తిరుపతి రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ డెయిరీ సమీపంలో ఉన్న జర్నలిస్టు కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. చీకటి పడిన వెంటనే విద్యుత్ మోటార్లు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు కథనం మేరకు.. గాంధీపురం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న జర్నలిస్టు కాలనీలో ఇళ్లలోకి దొంగలు యథేచ్ఛగా వస్తుండడంతో ఇంటి లోపల మహిళలు ఒంటరిగా ఉండాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆ కాలనీలోని వీధుల్లో విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడం, ఆ ఇళ్లకు ఆనుకుని ముళ్ల చెట్లు ఏపుగా పెరగడంతో దోపిడీ దొంగలు, మత్తుకు భానిసైన యువకులు ఆ చెట్ల మాటున దాక్కుంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి విద్యుత్ మోటార్లు, విలువైన వస్తువులను అపహరించేందుకు ప్రయత్నం చేశారు. గుట్టుగా చోరీకి పాల్పడుతున్న ఆ ఇద్దరిని ఓ జర్నలిస్టు గుర్తించి, ఎవరని ఆరా తీయగా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో స్థానికులు చుట్టుముట్టి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరుగెత్తి ముళ్ల చెట్ల మాటున చీకట్లో దాకున్నారు. ఇంతలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి రూరల్ ఎస్‌ఐ షేక్‌షావల్లీతో పాటు పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని ముళ్ల చెట్లు మాటున దాక్కున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ చెట్లు మాటు నుంచి బయటకు వచ్చిన మగ వ్యక్తి పరారుకాగా, మహిళ పోలీసులకు చిక్కింది. ఆ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించి, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. కాగా జర్నలిస్టుల కాలనీలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.