
లారీ బోల్తా
చంద్రగిరి: ప్రమాదవశాత్తు భాకరాపేట ఘాట్‌లో లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కలకడ నుంచి టమాట లోడ్‌తో లారీ విశాఖపట్నం నగరానికి మంగళవారం బయలుదేరింది. భాకరాపేట కనుమలో పెద్ద మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ యజమాని నాగేశ్వరరావు, లారీ డ్రైవర్ ప్రసాద్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
భూసేకరణ
వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు, చైన్నె నేషనల్ హైవే పీడీలు, తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు, రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి సంబంధిత మండలాల తహసీల్దార్లు, తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులపై రేణిగుంట, పూడి, గూడూరు, పాకాల, తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఆరులేన్ల రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుంచి చైన్నె రహదారి పనులు పూర్తి చేయాలని, భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్‌భరత్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.