
సినీ ఫక్కీలో చోరీ
పాకాల:మండల కేంద్రంలో సోమవారం గొలుసు దొంగల ముఠా సినీ పక్కీలో చోరీ చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు.. పాకాల మండలం గాదంకి వద్ద కమలమ్మ(84) వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఎక్కి పాకాల బస్‌స్టాండ్‌లో దిగింది. అదే సమయంలో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు కమలమ్మ వద్దకు చేరుకుని ఆమెతో కలిపారు. తమది కూడా మీ పక్క ఊరే అంటూ కుశల ప్రశ్నలు అడిగారు. మెడలో వేసుకున్న బంగారు నగలు వైపు చూస్తూ పట్టపగలు ఇలా ఎందుకు నగలు వేసుకొచ్చావ్, అసలే పాకాలలో దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారంటూ వృద్ధురాలికి నమ్మకం కలిగేలా మాటలు చెప్పారు. ఏమీ కాదులే అన్న వృద్ధురాలితో లేదు లేదు ఈ మధ్యనే తమ బంధువులు ఒకావిడ ఇలాగే నగలు వేసుకొస్తే నగలు దొచుకెళ్లారని నమ్మబలికింది. వారి మాటలు వినిన వృద్ధురాలు వారితో మాటలు కొనసాగింది. ఇదే అదునుగా భావించిన ఆ గుర్తు తెలియని మహిళలు వృద్ధురాలి మెడలోని గొలుసుని తీసుకుని, వృద్ధురాలి వద్ద ఉన్న బ్యాగులో వేసుకోవాలని సూచించారు. వారి మాటలు నమ్మిన కమలమ్మ మెడలోని సుమారు 3 సవర్ల బంగారు గొలుసును తీసి బ్యాగులో పెట్టే ప్రయత్నం చేసింది. అలా కాదంటూ గుర్తు తెలియని మహిళలు తమ వద్ద ఉన్న ఓ పేపర్‌లో చుట్టి ఇలా బ్యాగులో పెట్టాలని నమ్మించారు. నమ్మిన కమలమ్మ పాకాలలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లి పోయింది. అనంతరం తన బ్యాగులో బంగారు గొలుసు కోసం బ్యాగులో ఉన్న పేపర్‌ను తెరవగా అందులో అసలు బంగారు గొలుసు బదులు నకిలీ గొలుసు ఉండడం చూసి షాక్‌కు గురైంది. తనను ఆ ఇద్దరు మహిళలు మోసం చేశారని గుర్తించిన కమలమ్మ జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు పాకాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సీఐ సుదర్శన్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.