
బతుకు వేటలో గిరిజనం
సూళ్లూరుపేట: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పులికాట్‌లో నీరు చేరడంతో గిరిజన జాలర్లకు బతుకు పంట పండింది. వేటలో నిమగ్నమై చేపలు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో వారికి ఆదాయం చేకూరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో ఆటుపోట్ల కారణంగా కడలి కల్లోలంగా మారింది. పెద్దపెద్ద ఆలలు వస్తుండడంతో సముద్రం నుంచి నీరు భారీగా పులికాట్ సరస్సుకు చేరుతోంది. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో ఉండే గిరిజన జాలర్లుకు చేతి నిండి పనిదొరికినట్లు అయ్యింది. చేపలవేట జీవనాధారంగా బతుకుతున్న గిరిజన జాలర్లు నాలుగు డబ్బులు సంపాదించేందుకు విసురుడు వలలతో చేపల వేటలో నిమగ్నమై బతుకు పోరాటం సాగిస్తున్నారు. పులికాట్ సరస్సు వెంబడి తడ మండలం నుంచి చిట్టమూరు మండలం వరకు ఉన్న సుమారు ఐదారు వేల గిరిజన కుటుంబాలకు చేపల వేటే ప్రధానవృత్తి. గిరిజనులకు పడవలు, పెద్ద పెద్ద వలలు కోనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేక పోవడంతో విసురుడు వలలను వారే స్వయంగా అల్లుకుని చేపల వేట సాగిస్తారు. ఈక్రమంలో సూళ్లూరుపేట–శ్రీహరికోట మార్గంలో ఉన్న చిన్న బ్రిడ్జిలపై నిలబడి వల విసిరి చేపల వేట సాగిస్తున్నారు.