
డేటా సైన్స్ సెంటర్ ప్రారంభం
తిరుపతి రూరల్ : మండలంలోని తుమ్మలగుంట పంచాయతీ నలందానగర్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ (ఐఎస్‌పీఎస్) డేటా సైన్స్ సెంటర్‌ను కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ గణాంక వేత్త డాక్టర్ సీఆర్‌రావు 105వ జయంతి సందర్భంగా డేటా సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆధునిక ప్రయోగశాల, డిజిటల్ క్లాస్ రూములు, లైబ్రరీ అందుబాటులో ఉంటాయి. గణాంక శాస్త్రం, మెషీన్ లెర్నింగ్, కృత్తిమ మేధస్సు (ఏఐ) రంగాలలో పరిశోధన, శిక్షణ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా డేటా సెంటర్‌ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. అనంతరం ఐఎస్‌ఐ మాజీ డైరెక్టర్ బీఎల్‌ఎస్ ప్రకాశరావు, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణలతో కలిసి సీఆర్‌రావు సెమినార్ హాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. సెల్ప్ స్టడీ లైబ్రరీ, రూఫ్ గార్డెన్‌ను సందర్శించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. డేటా సైన్స్ సెంటర్ విద్యార్థులకు, ప్రభుత్వ ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ సీఆర్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఐఎస్‌పీఎస్ గౌరవ అధ్యక్షుడు పి.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ డేటా సైన్స్ సెంటర్ భవన నిర్మాణం, వసతులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారాలను వివరించారు. ఐఎస్‌పీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పీజీ శంకరన్, ప్రొఫెసర్ ఆర్‌ఎల్ షిండే, ప్రొఫెసర్ సోమేష్‌కుమార్ పాల్గొన్నారు.