
భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థ తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నమయ్యభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కేవలం 2వారాలే ఉన్నాయని, నిర్దేశిత గడువులోపు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించాలని కోరారు. ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు మరింతగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యుల ఫీడ్ బ్యాక్‌తోపాటు డయల్‌యువర్ ఈఓ, ఐవీఆర్‌ఎస్, వాట్సాప్ ద్వారా భక్తుల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. తక్షణం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. విధానపరమైన నిర్ణయాలలో టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమష్టిగా భాగస్వాములు కావాలన్నారు. అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వసతి, అన్నప్రసాదాలు, డొనేషన్ తదితర శాఖలలో విధానపరమైన వ్యవస్థలను తీసుకువచ్చామని తెలిపారు. ఇతర శాఖల్లోనూ ఇదే విధానం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జేఈఓ వి.వీరబ్రహ్మం మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీ సీవీఎస్‌ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ, అలిపిరి టోల్ గేట్ ఆధునికీకరణ చేపట్టినట్లు తెలిపారు.