
చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు
తిరుపతి అర్బన్ : జిల్లాలోని చెరువుల అభివృద్ధి పనులకు సంబంధించి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 181 చెరువుల పరిధిలో 30,081 హెక్టర్లు సాగు భూమి ఉందన్నారు. ఈ చెరువుల అభివృద్ధికి రూ.515 కోట్ల మేర ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చెరువులను బలోపేతం చేయాలని కోరారు. ఇరిగేషన్ తిరుపతి ఎస్‌ఈ రాధాకృష్ణ, చిత్తూరు ఎస్‌ఈ వెంకటేశ్వరరాజు, నెల్లూరు ఎస్‌ఈ దేశినాయక్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, భూగర్భజలవనరులశాఖ డీడీ శోభనబాబు పాల్గొన్నారు.
ఆరోగ్య లక్ష్యాల సాధనకు కృషి
జాతీయ ఆరోగ్య లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యబృందంతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేస్తేనే గ్రామీణులకు వైద్యులపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో పకడ్బందీగా వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, వైద్యాధికారులు శైలజ, మురళీకృష్ణ, శ్రీనివాసరావు, శాంతకుమారి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.