
ప్రయాణికుల కష్టాలు
తిరుపతి అర్బన్ : సూపర్‌సిక్స్ విజయోత్సవ సభ బుధవారం అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు జిల్లా నుంచి 364 బస్సులను మంగళవారం తెల్లవారు జామున తరలించారు. జిల్లాలో 762 ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో 50 శాతం సర్వీసులను అనంతపురంలో నిర్వహిస్తున్న సీఎం సభకు తరలించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. జిల్లాలోని 11 డిపోల నుంచి బస్సులను అనంతపురానికి పంపించారు. ఒక్కో డిపో నుంచి 30 నుంచి 70 సర్వీసులను సభకు తరలించారు. సాధారణంగా తిరుమల బస్సులను ఏ సమావేశానికి ఎప్పుడూ పంపించిన సందర్భాలు లేవు. అయితే అనంతపురం సభకు తిరుమలకు వెళుతున్న 70 బస్సులను తరలించారు. తిరిగీ ఈ సర్వీసులు జిల్లాకు గురువారం వస్తాయని అధికారులు చెబుతున్నారు. సీఎం మీటింగ్ నేపథ్యంలో ప్రయాణికులకు మూడు రోజుల పాటు కష్టాలు తప్పడంలేదు. . తిరుపతి బస్టాండ్‌లో మంగళవారం బస్సుల కోసం గంటల కొద్ది ప్రయాణికులు వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ అధికారులు ఇలా అడ్డదిడ్డంగా మీటింగుల పేరుతో బస్సులను పక్క జిల్లాకు తరలించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికుల కష్టాలు