
తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు : కలెక్టర్
తిరుపతి అర్బన్ : జిల్లాలో ఏదైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే తప్పుడు నివేదికలు కాకుండా వాస్తవ సమాచారంతో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో పీజీఆర్‌ఎస్‌తోపాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. జేసీ శుభం బన్సల్‌తోపాటు తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ మౌర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అలాగే సంఘటనలకు సంబంధించి నిర్లక్ష్యంగా తప్పుడు నివేదికలు ఇస్తే తక్షణమే చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రేణిగుంట మండలంలో డయేరియాతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన నేపథ్యంలో రేణిగుంట ఈవోపీఆర్‌డీని సస్పెండ్ చేయాలని డీపీవో సుశీలాదేవిని ఆదేశించారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఈఈ నరేంద్రను ఆదేశించారు. స్థానిక వీఆర్వోపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డిని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్‌ఎంలతోపాటు వైద్య బృందం నుంచి శుక్రవారం లోపు నివేదిక పంపాలని ఆదేశించారు, అలాగే ఈ– క్రాప్ వేగవంతం చేయాలని, యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని డీఏవో ప్రసాద్‌రావును ఆదేశించారు.