
తీర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత కల్పించండి
తిరుపతి అర్బన్ : సముద్రతీర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుగ్గిరాజుపట్నం కోస్టల్ పోలీస్‌స్టేషన్ మరమ్మత్తులు, కాంపౌండ్ వాల్ తదితర చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ అధికారి వెంకటరమణ, డిప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ బాలిరెడ్డి, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ తిరుపతి అసిస్టెంట్ కమీషనర్ విజయ కుమార్, కోస్ట్ గార్డ్ అధికారి సురేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, మైరెన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
రెండిళ్లలో చోరీ
పాకాల : తాళాలు వేసిన ఇంటిని పసిగట్టి రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెద్దరామాపురం పంచాయతీ యనమలవారిపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి, నాగేంద్రబాబు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగుల గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. నాగలక్ష్మి ఇంటిలో వెండి 60 గ్రాములు, 1 గ్రాము బంగారం, నాగేంద్ర ఇంటిలో 4 గ్రాముల బంగారం, 140 గ్రాముల వెండి నగలు అపహరించారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సుదర్శన ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై దాడులు
నాగలాపురం : రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు. మండలంలోని మలిమేలు కండ్రిగ వద్ద అరణియార్ నదిలో సోమవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్‌ఐ సునీల్ సిబ్బందితో ఇసుక అక్రమ రవాణాదారులపై మెరుపు దాడి నిర్వహించి, ట్రాక్టర్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై రాత్రి వేళలో ఇసుక తరలించిన ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశామని ఎస్‌ఐ తెలిపారు.