
ఎర్రమట్టి..కొల్లగొట్టి!
పాలసముద్రం: మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు కొల్లగొడుతోంది. అందినకాడికి ఎర్ర గావెల్‌ను తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. దీనిపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి అండతో మరింత రెచ్చిపోతోంది. మండలంలోని వనదుర్గాపురం రెవెన్యూ లేక్కదాఖాల జగనన్న కాలనీ సమీపంలోని గుట్టపై కన్నేసింది. తలసిందే తడువుగా హిటాచీలు దించేసింది. పదుల సంఖ్యలో ఎర్రగ్రావెల్‌ను నింపి లారీలను సరిహద్దు దాటించింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే!
మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీకి ఆనుకుని గుట్టలున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఈ గుట్టల్లోని మట్టిని తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ గ్రావెల్‌ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.
వాహనాలు సీజ్
వనదుర్గాపురం గుట్టలో ఎర్రమట్టి తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుకున్న తహసీల్దార్ అరుణకుమారి, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తవ్వకాలు, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడంతో తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేశారు. తమిళనాడు టిప్పర్లకు అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని ఎస్‌ఐ తెలిపారు.