
ఘటోత్సవ వైభవం
వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ జన జాతర అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమైంది. ఘటోత్సవంతో అమ్మవారి సంబరం అంబరాన్నంటింది. ఘటోత్సవం చూసేందుకు తరలివచ్చిన అశేష భక్త జనంతో వెంకటగిరి పట్టణ పుర వీధులు కిక్కిరిశాయి. పోలేరమ్మ తల్లీ చల్లగా చూడాలమ్మా అంటూ వేడుకున్నారు. ఘటం కుండలకు అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించి ఆధ్యాత్మికతను చాటుకున్నారు. ఘటం కుండలతో ఇంట్లో పూజలు చేస్తే సాక్షాత్తు పోలేరమ్మ తల్లే ఇంట్లో కొలువై ఉంటుందన్న విశ్వాసం. దీంతో అమ్మవారి ఘటోత్సవానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకున్నారు.
ఘటోత్సవంలో అత్యుత్సాహం
వెంకటగిరి (సైదాపురం) : రాష్ట్ర పండుగ వెంకటగిరి పోలేరమ్మతల్లి జాతర సందర్భంగా ఆదివారం ఘటోత్సవంలో సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త విధానాలకు తెరలేపడంతో భక్తుల ఆగ్రహంతో పాత పద్ధతిలోనే కొనసాగించారు. వివరాలు ఇలా.. ఆదివారం నిర్వహించిన ఘటోత్సవంలో సంప్రదాయాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. వాస్తవానికి ఘటోత్సవం జీనుగుల వారి వీధిలోని మెట్టినింటి మండపం వద్ద నుంచి రాజా ప్యాలెస్‌కు నడక మార్గంలో ఘటం కుండలను ఊరేగించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాలను ఈ ఏడాది పక్కన పెట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘటం కుండలను ఊరేగించేందుకు ప్రత్యేక వాహనంలో జీనుగుల వారి వీధిలోని అమ్మ మెట్టి నింటి మండపం వద్ద ఎక్కించేశారు. ఘటం కుండలు నడకమార్గం గుండా రాకపోవడంతో స్థానికంగా ఉన్న పట్టణ ప్రముఖులు ఆగ్రహించారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య యథావిధిగా కాలి నడక ద్వారా సాగించారు.

ఘటోత్సవ వైభవం