
అటవీ భూములపై రాబందులు
కూటమి నేతల బరితెగింపు రామచంద్రాపురంలో కనుమరుగవుతున్న అటవీ భూములు వందల ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నా చర్యలు శూన్యం రెవెన్యూ అధికారుల సహకారమంటూ ఆరోపణలు ఓ నేత కుటుంబ సభ్యులకు భారీగా నగదు బదలాయింపు
సెంటు భూమి ఆన్‌లైన్ చేసుకునేందుకు రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. నిలువ నీడలేని పేదలు ఇంటి స్థలాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాలలో గుట్టలుగా పడి ఉన్నాయి. దేశసేవ చేసిన జవాన్‌లకు భూమి ఇవ్వాలంటే అధికారులకు చేతులు రావట్లేదు. అలాంటిది కూటమి ప్రభుత్వంలో కూటమి నేతలు వందల ఎకరాల ప్రభుత్వ అటవీ భూములను యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలానికి విశాలసమైన అటవీ ప్రాంతం ఉంది. తుడా పరిధిలో ఈ మండలం కలిసి ఉండటంతో ఇక్కడ భూములకు మంచి డిమాండ్ ఉంది. దీని దృష్ట్యా కూటమి రాబందులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఖాళీగా కనిపించే అటవీ భూములను తన్నుకుపోతున్నారు. మార్కెట్‌లో భూమి ధరలు విపరీతంగా ఉండటంతో కొందరు కూటమి నాయకులు పక్కా ప్రణాళికతో అదును చూసుకుని అటవీ భూములను చదును చేయడం, హద్దులు గీసుకొని ఇనుప కంచెలు వేసుకొని దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఆపై భూములకు హద్దురాళ్లు పెట్టుకొని ఉపాధి హామీ నిధులతో యథేచ్ఛగా మామిడి తోటలను పెంచుకోవడం కొసమెరుపు. అక్రమణదారులకు అండగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తొత్తులుగా మారిపోవడంతో ఇష్జారాజ్యంగా సర్వే నంబర్లు సృష్టించడం, దొంగ పట్టాలను రూపొందించడం, అధికార బలంతో ఆన్‌లైన్ ప్రక్రియలు చేస్తున్నారంటూ ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీనిపై కొంత మంది రెవెన్యూ అధికారులు హస్తం ఉందని మండలంలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆక్రమణలు ఎక్కడంటే..
మండంలోని అనుప్పల్లి సర్వే నంబరు 411 నుంచి 480 వరకు సర్వే నంబర్లను సృష్టించుకుని సుమారు 100 ఎకరాలకు పైగా అటవీ భూమిని ఆక్రమించేశారు. పుల్లమనాయుడు కండ్రిగకు చెందిన ఓ ఎస్టీ మహిళకు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2 ఎకరాల భూమికి సంబంధించి పట్టాను అందజేశారు. అయితే అదే పట్టాతో సమీప గ్రామంలో అగ్రకులానికి చెందిన ఓ నేత 10 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించేశాడు. ఆపై ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద పనులు సైతం చేయించుకుని, ప్రస్తుతం వాటి ఆనవాళ్లు లేకుండా చెరిపేశారు. రాయలచెరువు సర్వే నంబరు 410/1, 410/6, 409/1ఎలో నాలుగు ఎకరాలు ఉన్నట్లు పత్రాలు సృష్టించుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో 20 ఎకరాలకు పైగా ఆక్రమించుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.
బోగస్ సర్వే నంబర్లతో ఆక్రమణలు..
అనుప్పల్లి, రాయలచెరువు, పుల్లమనాయుడు కండ్రిగలో వందల ఎకరాల ఆక్రమణలోని పత్రాల్లో నమోదు చేసిన సర్వే నంబర్లు పూర్తిగా బోగస్ నంబర్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో 2019లో అటవీ భూముల ఆక్రమణలపై అధికారులు అడ్డుకున్నారు. ఇక్కడ ఎలాంటి పనులు చేయకూడదంటూ స్పష్టం చేశారు. దీంతో గత ప్రభుత్వంలో ఆక్రమణలకు చెక్ పడింది.
అటవీ భూముల వెనుక ఆ నేత అభయం
రామచంద్రాపురం మండలంలో గత ఏడాదిన్నర కాలంలో జరిగిన వందల ఎకరాలు అన్యాక్రాంతం వెనుక నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు సంపూర్ణ సహకారం ఉందన్న చర్చ మండలంలో జోరుగా సాగుతోంది. గత వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన స్థానిక నేత ఒకరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులతో డీల్ చేసినట్లుగా ఆ పార్టీ నేతలో బహిరంగంగా విమర్శిస్తున్నారు. వందల ఎకరాలను కూటమి నేతలు వశం చేసుకోవడానికి, సుమారు రూ.40 లక్షలకు పైగా ముడుపులు అందించినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రేక్షకపాత్ర వహిస్తున్న రెవెన్యూ అధికారులు
రామచంద్రాపురం మండలంలో కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని రక్షించాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు మౌనంగా ఉండడంపై ప్రజలు మండిపడుతున్నారు. 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అటవీ భూముల దోపిడీపై జిల్లా అధికారులు సైతం చర్యలు చేపట్టారు. వారి వద్ద ఉన్న పత్రాలు, సర్వే నంబర్లు బోగస్ అని అధికారులు అప్పట్లోనే తేల్చేశారు. అయితే ప్రస్తుతం మరోసారి కూటమి అధికారంలోకి రావడంతో రెక్కలు విప్పుకుని అటవీ భూములపై వాలిపోతున్నారు. విలువైన భూములను పరిరక్షించాల్సింది పోయి, రెవెన్యూ అధికారులు వారితో చేతులు కలపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అటవీ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.

అటవీ భూములపై రాబందులు