
ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. మూల విరాట్‌కు పవిత్ర మాలధారణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్రమాలలు విశేష పూజా ద్రవ్యాలను శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ బాపిరెడ్డి, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయకుడికి పవిత్రమాల సమర్పించారు. అనంతరం వినాయకుడు, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పవిత్రమాలల సమర్పణ వేడుకగా చేపట్టారు. యాగశాలలో శాంతి హోమ పూజలు, చండికేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయన్నారు.
మహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
చంద్రగిరి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన చేపట్టారు. అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. దీంతో పవిత్రోత్సవాలను పరిసమాప్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజు, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
పెంచలకోన క్షేత్రంలో...
రాపూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిలు శేష వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై కొలువుతీర్చి క్షేత్రోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి వారి అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శాంతి హోమం, పూర్ణాహుతి , నివేదన, మహాకుంభప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి మాట్లాడుతూ.. మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయన్నారు.

ముగిసిన పవిత్రోత్సవాలు

ముగిసిన పవిత్రోత్సవాలు

ముగిసిన పవిత్రోత్సవాలు