
శోత్రియ భూముల్లో దొంగలు పడ్డారు!
వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు పంచాయతీ వీకేఆర్‌వైకాలనీ ఆక్రమణలకు అడ్డాగా మారింది. పరిసర ప్రాంతాల్లో భారీగా పరిశ్రమలు రావడంతో ఈ ప్రాంతంలోని పొలాలకు ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. డీకేటీ భూమి సైతం ఎకరా రూ.కోట్లలో పలుకుతోంది. ఒక్కసారిగా ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ఆ భూములపై కన్నేశారు. కాలనీలో గిరిజనులకు కేటాయించిన ఇంటి స్థలాలను దర్జాగా కొనుగోళ్ల పేరుతో కబ్జా చేసేశారు. అక్కడితో ఆగకుండా నాలుగురోజులగా దున్నకాలు చేపట్టారు. సాగు పేరుతో పూర్తిగా సొంతం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
వరదయ్యపాళెం : మండలంలోని చిన్నపాండూరు పరిధి పాదిరికుప్పం రెవెన్యూలోని 1,056 ఎకరాల శోత్రియ భూముల్లో అక్రమార్కులు పాగా వేస్తున్నారు. నాలుగు రోజులుగా శోత్రియ భూముల్లో ఓవైపు పొలం దన్నకాలు చేపట్టి ఆక్రమణ దశగా పావులు కదుపుతున్నారు. ఈ భూములు సత్యవేడు–చిన్న పాండూరు ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉండడంతో ఆక్రమణకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు షికారీలు ఆక్రమించుకుని, ఆ భూమి తమ పూర్వీకులకు చెందినదిగా బుకాయిస్తూ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగే కొనసాగితే శోత్రియ భూములు పూర్తిగా కబ్జాలోకి వెళ్లిపోయే ప్రమాదముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చోద్యం చూస్తున్న రెవెన్యూ
శోత్రియ భూముల ఆక్రమణలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతంగా ఉన్న శోత్రియ భూముల్లో ఓవైపు దుక్కి దున్నకాలు, మరోవైపు గ్రావెల్ అక్రమ రవాణా, షికారీల గుడిసెలు ఇలా ఇష్టారాజ్యంగా కబ్జాల పర్వం కొనసాగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ప్రధాన రోడ్డుకు రెండు వైపులా ఆక్రమణలు
చిన్న పాండూరు–సత్యవేడు ప్రధాన రోడ్డు మార్గంలోని వీకేఆర్‌వైకాలనీ సమీపంలో రోడ్డుకు తూర్పు, పడమర రెండు వైపుల సుమారు 100 ఎకరాల్లో దున్నకాలు చేపట్టి ఆక్రమణకు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఎకరా రూ. 10కోట్లకు పైగా విలువ కలిగిన ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమణల పాలవుతున్నా అధికారులు స్పందించడం లేదు.