ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా అరెస్టు చేయరా? | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా అరెస్టు చేయరా?

Sep 4 2025 5:43 AM | Updated on Sep 4 2025 5:43 AM

ఎస్సీ

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా అరెస్టు చేయరా?

● కళ్లముందరే నిందితులు తిరుగుతున్నా పట్టించుకోరా? ● దుర్గసముద్రం దళితులకు హోంమంత్రి అనిత న్యాయం చేయాలి ● వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర డిమాండ్‌

తిరుపతి రూరల్‌ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని, ముఖ్యంగా దుర్గసముద్రంలోని దళితవాడపై అగ్రకులాల దాడి ఘటనపై ఆమె స్పందించాలని జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రాజేంద్ర డిమాండ్‌ చేశారు. తిరుపతి రూరల్‌ మండలం దుర్గ సముద్రం గ్రామంలోని దళితవాడలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ విభాగం నేతలు పర్యటించారు. ముందుగా అగ్ర కులాలకు చెందిన వారు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన వారిని పరామర్శించి గ్రామంలో ధ్వంసమైన ఇళ్లను పరిశీలించారు. అనంతరం అక్కడే పికెట్‌ నిర్వహిస్తున్న పోలీసులతో మాట్లాడి దళితులకు రక్షణగా నిలబడాలని, అగ్ర కులాలపై చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకుండా వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలన్నారు. అంతకు ముందు బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు ఎస్సీసెల్‌ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ.. తాము గ్రామంలో తాగునీరు పట్టుకునేందుకు వెళ్లినా కులం పేరిట అవమానాలకు గురిచేస్తున్నారని, దూరంగా ఉండాలని, తమను మానసికంగా హింసిస్తున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన ఎస్సీ సెల్‌ నేతలు ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ.. దళితవాడపై టీడీపీ సానుభూతి పరులైన అగ్రకులాలకు చెందిన వారు కర్రలు, రాడ్లు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడులు చేసి గాయపరిస్తే పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారన్నారు. ఆ కేసులో నిందితులు కళ్లముందే తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయడం లేదన్నారు. దాడిలో భాగస్వాములైన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి దళితులకు రక్షణ కల్పిస్తూ న్యాయం చేయాలన్నారు. అలా చేయని పక్షంలో తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాడుల్లో గాయపడిన బాధితులకు అండగా నిలబడతామన్నారు. పర్యటనలో ఎస్సీ సెల్‌ నేతలు శెల్వం, మల్లారపు వాసు, శివలతో పాటు అదే గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత జ్యోతి రెడ్డిలు వున్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా అరెస్టు చేయరా? 1
1/1

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా అరెస్టు చేయరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement