
విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలి
తిరుపతి కల్చరల్ : అధికారులు నిబద్ధతతో పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పి.సత్యనారాయణ పిలుపు నిచ్చారు. తుడా కార్యాలయం ఆవరణలోని ఆడిటోరియంలో బుధవారం రాయలసీమ జిల్లాలు తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సంక్షేమ అధికారులు వసతి గృహ విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం పాటు పడాలన్నారు. వసతి గృహాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సంక్షేమ అధికారులను కోరారు. అనంతరం బీసీ సంక్షేమ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ట్యూటర్లను నియమించి మంచి ఫలితాలు సాధించాలన్నారు. సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ డి.చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ.. ప్రతివారం పరీక్షలు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పద్మావతి మహిళా కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలు పెంపొందించాలన్నారు. స్విమ్స్ వైద్య కళాశాల గుండె వైద్య నిపుణురాలు ప్రొఫెసర్ వనజ మాట్లాడుతూ.. యోగా, ధ్యానం, ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాఘవేంద్ర మీరా, జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి ఎం.భరత్ కుమార్‌రెడ్డి, రాయలసీమ జిల్లాల వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.