
కూటమి అరాచకాలకు చరమగీతం పాడుదాం
రాపూరు/సైదాపురం : కూటమి అరాచకాలకు రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోతున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాపూరులోని బత్తిన పట్టాభిరామిరెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టే దిశగా కూటమి ప్రభుత్వ కుట్రలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా అరాచకాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. యూరియా కోసం రైతులు క్యూలైన్‌లో ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యను పరిష్కరించాల్సిన ఆశాఖ మంత్రి అచ్చెం నాయుడు రైతులను అవహేళనగా మాట్లాడం సమంజసం కాదని ఆరోపించారు. 2027 జమిలీ ఎన్నికల్లో రామ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెంకటగిరి నుంచే గెలుపు ఆరంభం కానున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కాకాణి పూజిత, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేతలు బత్తినపట్ల పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.