
దుర్గసముద్రంలో కొనసాగుతున్న పికెట్
11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో దళితవాడపైకి అగ్రకులానికి చెందిన వారు దాడి చేసిన ఘటనలో గాయపడిన వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడంతో మంగళవారం పోలీసులు పికెట్ కొనసాగించారు. దళితవాడను సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవ్వరినీ రానీయకుండా కట్టడి చేశారు. దాడులు చేసిన ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి దళితవాడ వైపు కన్నెత్తి చూడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. సీఐ చిన్న గోవిందు తమ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండగా డీఎస్పీ ప్రసాద్ పికెట్‌ను పర్యవేక్షిస్తున్నారు. దాడుల్లో తీవ్రంగా గాయపడిన చిరంజీవి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఓ సామాజిక వర్గానికి చెందిన మునిప్రసాద్, మాకా హరీష్, జగదీష్, విజయ్, బాలాజీ, గాజుల రవి, పి.భరత్, శ్రీకాంత్, ఎం.లోకేష్, ఎం.శాంతికుమార్, మాకా మహేష్ అను 11 మంది యువకులపై ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. కాగా గ్రామంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, గ్రామాలపై ఎవ్వరు దాడులు చేసినా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.