
ఫెర్టిలైజర్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
వరదయ్యపాళెం : మండల కేంద్రమైన వరదయ్యపాళెం, చిన్న పాండూరు ప్రాంతాల్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఏఓ రామాంజనేయ రెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణ వ్యవసాయశాఖ సిబ్బందితో కలసి దుకాణాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి బిల్లులు లేకుండా అనధికారికంగా నిల్వ ఉంచిన యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఎరువులకు సంబంధించి 15 రోజుల లోపు బిల్లుల వివరాలను తమ దృష్టికి తీసుకువచ్చిన తర్వాతే వాటిని విక్రయాలకు అనుమతులు కల్పిస్తామని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు తప్పనిసరిగా ఎంఆర్‌పీ ధరలకే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించాలని సూచించారు. ప్రతి దుకాణం వద్ద రైతులకు తెలిసే విధంగా ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. వారి వెంట మండల వ్యవసాయశాఖ అధికారిణి గౌరి, ఏఈఓ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.