
స్విమ్స్ పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి తుడా: స్విమ్స్ యూనివర్సిటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా ఒక ప్రకటనతో తెలిపారు. ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ, ఎమ్మెస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్‌లో డయాలసిస్ టెక్నాలజీ, ఎమ్మెస్సీ క్లినికల్ వైరాలజీ, ఎమ్మెస్సీ క్లినికల్ సైకాలజీ, స్పెషలైజ్డ్ నర్సింగ్ కోర్సులలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవా లని కోరారు. దరఖాస్తులు, మరిన్ని వివరాల కోసం స్విమ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 69,928 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,297 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.21 కోట్లు సమర్పించారు.
స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధంకండి
తిరుపతి అర్బన్: పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులుతో కలసి ఆయన అధికారులతో స మీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కా ర్యక్రమ ఏర్పాట్ల పూర్తి పర్యవేక్షణ తిరుపతి ఆర్డీ ఓ చేయాలని సూచించారు. పెరేడ్ గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, వేదిక అలంకరణను, కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ, తుడా వారు వివిధ అంశాల సమన్వయంతో ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదికా ఆఫర్
తిరుపతి ఎడ్యుకేషన్ : స్వాతంత్య్ర దినోత్సవ మాసాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్తగా ఆజాదికా ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆ సంస్థ జీఎం అమరేంద్రరెడ్డి, డిప్యూటీ జీఎం ఎస్.వెంకోబరావు మంగళవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్‌లో భాగంగా ఆగస్టు ఒకటి నుంచి 31వ తేదీలోపు కొత్తగా సిమ్ తీసుకునే వారికి రూపాయికే అందించడంతోపాటుగా 30 రోజుల వరకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు, అలాగే రోజుకు 4జీ, 2జీబీ డేటాను ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల ఒకటి నుంచి 31వ తేదీ వరకు కొత్తగా సిమ్ తీసుకునే వారితో పాటు ఇతర ఆపరేటర్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. వినియోగదారులు సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సేవా కేంద్రం, రిటైలర్‌ను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.