
అక్టోబరు 15 వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
● తిరుపతి, మదురై, నాగర్‌సోల్ వెళ్లే వారికి అనుకూలం ● రూట్ షెడ్యూల్ ప్రకటించిన రైల్వేశాఖ
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్న 54 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ప్రధాన మార్గాల్లో కొనసాగుతున్న రద్దీకి అనుగుణంగా పొడిగింపు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ రైళ్లు తిరుపతి, మదురై, నాగర్ సోల్‌కు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు. కాచిగూడ–మదురై మార్గంలో 07191/07192 నంబర్లు కలిగిన ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్–కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్–కన్యాకుమారి మార్గంలో 07230/07239 రెళ్లను పొడిగించారు. అదే విధంగా సికింద్రాబాద్–తిరుపతి మధ్య 10, కాచిగూడ–నాగర్‌సోల్ మధ్య 8, నాందేడ్–తిరుపతి మధ్య 10, నాందేడ్–ధర్మవరం మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఆరు ప్రధాన మార్గాల్లో నడుస్తున్న 54 ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు.
మదురై – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు
మదురై–కాచిగూడ స్పెషల్ ట్రైన్ ఆగస్టు 20వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు ప్రతి బుధవారమూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 07193/07194 నంబర్ కలిగిన రెండు స్పెషల్ రైళ్లు హైదరాబాద్– కొల్లం మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కొల్లం వెళ్లే ఈ స్పెషల్ రైళ్లు ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు ప్రతి శనివారమూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 07230/07229 నంబర్ గల రెండు రైళ్లు హైదరాబాద్–కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగిస్తాయి. 07229 నంబర్ కలిగిన హైదరాబాద్–కన్యాకుమారి స్పెషల్ రైలు ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతి బుధవారమూ నడుస్తుంది.