ప్లస్‌టూ పల్టీ! | - | Sakshi
Sakshi News home page

ప్లస్‌టూ పల్టీ!

Jul 16 2025 9:14 AM | Updated on Jul 16 2025 9:14 AM

ప్లస్

ప్లస్‌టూ పల్టీ!

● జిల్లాలోని 17 కళాశాలల్లో అడ్మిషన్లు శూన్యం ● మిగిలిన వాటిలోనూ అరకొరగానే ప్రవేశాలు ● వసతులు లేక విద్యార్థుల వెనకడుగు

హైస్కూల్‌ ప్లస్‌ కళాశాలల్లో ప్రవేశాలు లేక వెలవెలబోతున్నాయి. కూటమి ప్రభుత్వంపై వీటిపై పెద్దగా పట్టించుకోకపోవడంతో వసతులు, అధ్యాపకుల కొరతతో విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారు. ఫలితంగా పలు కళాశాలల్లో అరకొర ప్రవేశాలతోనే కాలం వెల్లదీయాల్సిన అగత్యం ఏర్పడింది.

తిరుపతి ఎడ్యుకేషన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని బాల, బాలికలకు కళాశాల విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాతీయ విద్యా విధానంలో భాగంగా 2022లో అప్పటి ప్రభుత్వం హైస్కూల్‌ ప్లస్‌లను ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని బాలికలు, పేద విద్యార్థులు ఇంటర్‌ విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు హైస్కూళ్లను హైస్కూల్‌ ప్లస్‌లుగా మార్పు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన అందించేందుకు అర్హత ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లకు డిప్లాయ్‌మెంట్‌ ద్వారా హైస్కూల్‌ ప్లస్‌లలో నియమించుకుని విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్లస్‌టూ కళాశాలల్లో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. సరైన వసతులు కల్పించక, అధ్యాపకులను నియమించకపోవడంతో ఈ దుస్థితి నెలకొన్నట్లు విమర్శలు వస్తున్నాయి.

తిరుపతి జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో 40 హైస్కూల్‌ ప్లస్‌లు ఉన్నాయి. వీటిలో 25 బాలికలకు కాగా, మిగిలిన 15 కో–ఎడ్యుకేషన్‌. అయితే వీటిలో సరైన వసతులు, అధ్యాపకులు లేకపోవడంతో వీటిలో ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటిలో 17 హైస్కూల్‌ ప్లస్‌లలో కనీసం ఒక్క అడ్మిషన్‌ కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.

ఒక్క అడ్మిషన్‌ కూడా పొందని కళాశాలలు

జెడ్పీహెచ్‌ఎస్‌ పద్మావతీపురం, జీహెచ్‌ఎస్‌ పెల్లకూరు, జెడ్పీహెచ్‌ఎస్‌ బాలాయపల్లి, జెడ్పీహెచ్‌ఎస్‌ ప్లస్‌ (బాలికలు) చిల్లకూరు, జెడ్పీహెచ్‌ఎస్‌ దగ్గవోలు, ఎస్‌ఏఎల్‌సీఈఎఫ్‌ హెచ్‌ఎస్‌ వాకాడు, జెడ్పీహెచ్‌ఎస్‌ పల్లమాల, జెడ్పీహెచ్‌ఎస్‌ డక్కిలి, జెడ్పీహెచ్‌ఎస్‌ చిట్టేడు, జెడ్పీహెచ్‌ఎస్‌ పాలమంగళం, జెడ్పీహెచ్‌ఎస్‌ అరిమేనుపాడు, జెడ్పీహెచ్‌ఎస్‌ చెంబేడు, జెడ్పీహెచ్‌ఎస్‌ కుప్పంబాదూరు, జెడ్పీహెచ్‌ఎస్‌ (బాలుర) రేణిగుంట, జెడ్పీహెచ్‌ఎస్‌ పెద్దకన్నలి, జెడ్పీహెచ్‌ఎస్‌ సత్యనారాయణపురం, జెడ్పీహెచ్‌ఎస్‌ బాలిరెడ్డి పాళెంలలో ఒక్క అడ్మిషన్‌ నమోదు కాలేదు. జెడ్పీహెచ్‌ఎస్‌ పద్మావతీపురంలో గత ఏడాది 37 మంది అడ్మిషన్లు పొందగా ఈ ఏడాది ఒక్కరూ చేరలేదు. జెడ్పీహెచ్‌ఎస్‌ తిరుచానూరులో గత ఏడాది 63 విద్యార్థులు ప్రవేశం పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 12కే పరిమితమయ్యింది.

వసతులు, అధ్యాపకులు లేక..

ఒక్కో హైస్కూల్‌ ప్లస్‌లో అందుబాటులో ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపునకు 53 మంది చొప్పున 159 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన 40 హైస్కూల్‌ ప్లస్‌లలో కలిపి మొత్తం 6,360 సీట్లు ఉన్నాయి. అయితే గత ఏడాది 40 హైస్కూల్‌ ప్లస్‌లలో బాల బాలికలు 836 మంది అడ్మిషన్లు తీసుకోగా ఈ ఏడాది 586కు దిగజారింది. దీనికి వసతుల లేమి, అధ్యాపకుల కొరత ప్రధాన సమస్యలుగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ హైస్కూల్‌ ప్లస్‌లలో ఒక్కో స్కూల్‌కు సుమారుగా 7 మంది వరకు టీచర్లు ఉండాలి. అయితే కొన్నింట్లో టీచర్లు ఉంటే విద్యార్థులు లేకపోవడం, విద్యార్థులుంటే టీచర్లు లేకపోవడం వంటి సమస్యను విద్యాశాఖ పరిష్కరించకపోవడంతో ఆ ప్రభావం అడ్మిషన్లపై పడుతోందని చెబుతున్నారు.

ప్రవేశాలు ఇలా..

2024–25 విద్యాసంవత్సరం 2025–26 విద్యాసంవత్సరం

బాలురు బాలికలు మొత్తం బాలురు బాలికలు మొత్తం

161 675 836 21 565 586

హైస్కూల్‌ ప్లస్‌లను పటిష్టం చేయాలి

సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్‌ విద్య అభ్యసించలేని పేద విద్యార్థులకు ఇంటర్‌ విద్యను అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన హైస్కూల్‌ ప్లస్‌లు విద్యార్థులకు గొప్ప వరం. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉన్న హైస్కూల్‌ ప్లస్‌ వ్యవస్థను ఇప్పటి ప్రభుత్వం పటిష్టం చేసి కొనసాగించాలి. 100 మందికిపైగా పదో తరగతి విద్యార్థులున్న హైస్కూళ్లను హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలి. అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్‌ హోదాకు సమానమైన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ)గా రెగ్యులర్‌ ప్రాతిపదికన పదోన్నతి కల్పించి హైస్కూల్‌ ప్లస్‌లలో నియమించి ప్లస్‌టూ వ్యవస్థను బలోపేతం చేయాలి.

–ఎస్‌.బాలాజీ, రాష్ట్ర అధ్యక్షుడు,

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌), తిరుపతి

త్వరలోనే నియామకాలు

హైస్కూల్‌ ప్లస్‌లలో త్వరలోనే అధ్యాపకుల నియామకం జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖకు కావాల్సిన అధ్యాపకుల పోస్టులు, ఇతర వసతుల కల్పనపై ఇదివరకే జిల్లా విద్యాశాఖ నుంచి వివరాలు అందించాం. ఆయా హైస్కూల్‌ ప్లస్‌ పరిధిలో ఉపాధ్యాయులు అడ్మిషన్‌ డ్రైవ్‌ను నిర్వహించి విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. హైస్కూల్‌ ప్లస్‌ ఆవశ్యకతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఎక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునేలా చర్యలు చేపట్టాం.

– కేవీఎన్‌.కుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ), తిరుపతి

ప్లస్‌టూ పల్టీ!1
1/2

ప్లస్‌టూ పల్టీ!

ప్లస్‌టూ పల్టీ!2
2/2

ప్లస్‌టూ పల్టీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement