
సంతకబీర్ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన
వెంకటగిరి(సైదాపురం) : చేనేత కళల్లో నైపుణ్యం జోడించి మగ్గంపై ఆసక్తికరమైన డిజైన్‌లను నేసిన వెంకటగిరి వాసి లక్కా శ్రీనివాసులు సంతకబీర్ అవార్డు కై వసం చేసుకోవడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగు గంగ అతిథి గృహంలో చేనేత కళాకారుడు లక్కా శ్రీనివాసులను కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శాలువకప్పి అభినందించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోనే వెంకటగిరికి చెందిన శ్రీనివాసులు ఎంపిక కావడం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉందని తెలిపారు. వస్త్రంపై రెండు వైపులా ఒకే డిజైనింగ్ ఉండేలా తయారు చేసి అవార్డు సాధించడం గొప్పవిషయమన్నారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి క్రైమ్ : తిరుపతి–రేణిగుంట రైల్వేస్టేషన్ మధ్య శెట్టిపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా, వడ్డేపల్లికి చెందిన సాకలి వీరేష్( 27) ఆటోనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. యువకుడు కోరమీనుగుంటలో నివాసం ఉంటున్న లోకేష్ బాబు జేసీబీకి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో సొంతూరికి వెళ్తున్నానని స్నేహితులకు చెప్పి బుధవారం రాత్రి రూమ్ నుంచి వెళ్లిపోయాడు. అయితే రూమ్ నుంచి వచ్చిన వీరేష్ రైలు కింద పడి మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.