
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అయ్యప్ప మాలధారణ
తిరుపతి కల్చరల్:శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అయ్యప్ప మాల ధారణ చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన పెద్దిరెడ్డి పుష్కరిణిలో స్నానం అనంతరం ఆలయంలో అర్చకుల చేత అయ్యప్ప మాల ధారణ స్వీకరించారు. అనంతరం ఆలయంలో శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ : స్థానిక అలిపిరి, జూపార్క్ రోడ్డులోని ఉదయమానిక్యం మహాత్మా జ్యోతి బాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రేష్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఈనెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 90007 83185 నంబర్ నందు సంప్రదించాలని సూచించారు.
మహిళల అభివృద్ధికి ప్రోత్సాహకం
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో పీఎం ఉషా స్కీంలో భాగంగా గురువా రం జెండర్ ఇంక్లూజీవ్ ఎంపవర్‌మెంట్ ఇనిషియేటీవ్ అనే అంశంపై కళాశాలల ప్రిన్సిపల్స్‌కు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు, రుసా కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ భరత్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మహిళా సాధికారత, జీవనోపాధి పెంపొందించడమే రుసా లక్ష్యమని, అందుకోసం మహిళలను ప్రోత్సహించేందుకు అనేక రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నా రు. వీసీ ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ.. పీఎం ఉష ద్వారా రూ.100 కోట్లు మహిళా యూనివర్సిటీకి రావడం చాలా సంతోషమని, ఇన్‌స్టిట్యూషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా పరిసర ప్రాంత మహిళల అవసరాలకు తగిన విధంగా శిక్షణ ఇచ్చి సాధికారిత వైపు ప్రోత్సహించడం అవసరమన్నారు. కార్యక్రమంలో కేరళ ఏఎస్‌ఏపీ సీఎండీ డాక్టర్ ఉష, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ తులసి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజిని పలు కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.
పీటీఎంలో ప్రొటోకాల్ రగడ
చిట్టమూరు : ప్రభుత్వ పాఠశాల్లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో మండలంలోని ఆరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. సమావేశంలో పనిచేసే ఉపాధ్యాయుడు ముందుగా స్కూల్ కమిటీ చైర్మన్‌ను స్టేజీ మీదకు పిలవకుండా టీడీపీ నేతలను పిలిచారని ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పాఠశాలకు రంగుల వేసేందుకు ఉపాధ్యాయులు గ్రామంలో కూటమి నాయకుల వద్ద చందాలు వసూలు చేసి రంగులు వేయించారు. దాతలను ముందుగా స్టేజ్ పైకి పిలిచారని, ప్రొటోకాల్ పాటించలేదని మరో వర్గానికి చెందిన కూటమి నేతలు ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉపాధ్యాయులు కూటమి నేతలకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమనిగింది. చిట్టమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో మండల విద్యాశాఖ అధికారి బీవీ కృష్ణయ్య ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్‌డే నిర్వహించారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి అయ్యప్ప మాలధారణ