రాయితీ రుణాలకు ఎదురుచూపులు | - | Sakshi
Sakshi News home page

రాయితీ రుణాలకు ఎదురుచూపులు

Jul 8 2025 4:23 AM | Updated on Jul 8 2025 4:23 AM

రాయితీ రుణాలకు ఎదురుచూపులు

రాయితీ రుణాలకు ఎదురుచూపులు

● నాలుగు నెలలు దాటినా జాడ లేని రుణాలు ● తమ వారికే రుణాలు అందేలా కూటమి ఆదేశాలు ● సిబిల్‌ స్కోర్‌ లేదని తిరస్కరించిన బ్యాంకులు ● జిల్లాలో స్వయం ఉపాధి రుణాల ఊసే లేదు

చిల్లకూరు: తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అటు ఉద్యోగాలు చూపక, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వక, కార్పొరేషన్‌ల ద్వారా రాయితీ రుణాలు మంజూరు చేయక యువతకు మొండి చేయి చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోండి నెల రోజుల్లో రాయితీ రుణాలు అందిస్తామంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతే ప్రతి పంచాయతీ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. దీంతో మండల స్థాయి అధికారులు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేయాలని కూటమి నాయకులు ఆదేశాలు జారీ చేశారు. వారిని ఎంపిక చేసి దరఖాస్తులను ఆయా బ్యాంకులకు మండల అధికారులు పంపారు. అయితే బ్యాంకు అధికారులు కూడా తామేం తక్కువ కాదని పంపిన దరఖాస్తు దారుల సిబిల్‌ స్కోర్‌ లేదని ఆ దరఖాస్తులను తిరిగి పంపేశారు. దీంతో తమ వారికి రాయితీ రుణాలు ఇప్పించే పరిస్థితి కనిపించక పోవడంతో రుణాల మంజూరుకు అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది.

నాలుగు కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు

జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే అర్హులైన వారు ఎంతో మంది ఉన్నప్పటికి తమకు అనుకూలంగా వ్యవహరించే వారికే రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపించారు. అయితే బ్యాంకు అధికారులు సిబిల్‌ స్కోర్‌ లేని వారు రాయితీ రుణాలకు అనర్హులంటూ ఆ దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో తమకు అనుకూలమైన వారు అనర్హులు కావడంతో మరొకరికి ఆ రుణాలు ఇవ్వకూడదంటూ అధికారులపై ఒత్తిడి తేవడంతో వారు మిన్నకుండి పోయారు. చివరగా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్‌ రాయితీ రుణాలపై మరోమారు మార్గదర్శకాలు ఇచ్చే వరకు తాత్కాలికంగా నిలిపి వేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతోనే నాలుగు నెలలవుతున్నా రాయితీ రుణాల ఊసే ఎత్తడం లేదు.

–ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రెండు వర్గాల వారికే రుణాలు ఇస్తుండగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా బ్రాహ్మణ, ఈబీసీ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, కాపులకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తిరుపతి జిల్లాలో 1,267 , బీసీ కార్పొరేషన్‌ ద్వారా 2,082 యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఇప్పటికే బ్యాంకులకు పంపిన జాబితాలో ఎంపికై న వారు బ్యాంకు అధికారులను కలుసుకుని అవసరమైన గ్యారంటీలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే అందరికీ ఒకేసారి రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు మిన్నకుండిపోయారు.

కార్పొరేషన్‌ యూనిట్లు దరఖాస్తులు కేటాయింపులు రాయితీ రుణం

ఎస్సీ 1,267 6, 284 రూ 52.89 కోట్లు రూ 20.88 కోట్లు రూ 29.36 కోట్లు

బీసీ 2,082 17,487 రూ 50.14 కోట్లు రూ 25.07 కోట్లు రూ 25.07 కోట్లు

ఆదేశాలు రావాలి

కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించాం. ఇంటర్వ్యూలు నిర్వహించడం పూర్తి చేశాం. అయితే బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సి ఉంది. ఆదేశాలు అందిన వెంటనే ఆయా బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలు అందిస్తాం.

– చెన్నయ్య, ఇన్‌చార్జ్‌ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌

నిరుద్యోగ భృతి ఇవ్వరు

కార్పొరేషన్‌ల ద్వారా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉద్యోగ అవకాశాలు దక్కక పోవడంతో కనీసం వయస్సు మీరేలోగా ప్రభుత్వం ద్వారా ఉపాధి అయినా పొందుతామనుకుని దరఖాస్తులు చేశారు. అలాంటి నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వక పోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement