
లోయలో పడి గుర్తు తెలియని వ్యక్తి ..
చంద్రగిరి : లోయలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి–పీలేరు జాతీయ రహదారి భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది. సీఐ సుబ్బరామిరెడ్డి వివరాల మేరకు.. ఆదివారం సాయంత్రం సుమారు 38 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి భాకరాపేట ఘాట్‌లోని పెద్ద మలుపు లోయలో పడి మృతి చెందినట్లు అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుబ్బరామిరెడ్డి తన సిబ్బందితో కలసి ఘటన స్థలానికి చేరుకుని, లోయలో పడి ఉన్న మృతదేహాన్ని పైకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించగా, ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడు శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం లోయలో పడి మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుడు ఆచూకీ తెలిసిన వారు చంద్రగిరి పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు.