
అస్తవ్యస్తంగా సచివాలయాలు
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో సచివాలయాలను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జోరుగా చర్చసాగుతుంది. అందులో భాగంగా జిల్లాలో చూస్తే 691 సచివాలయాల్లో 5625 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే....వాటిని 353 సచివాలయాలుగా కుదింపు చేశారు. దీంతో ఉద్యోగుల మిగులు తప్పలేదు. తాజాగా నిర్వహించిన బదిలీల్లో 1975 మంది ఉద్యోగులకు పోస్టింగ్‌లు లేవంటూ రిజర్వులో పెట్టేశారు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
స్పష్టతలేని బదిలీలు
బదిలీల్లో స్పష్టత లేకుండా పోయింది....ఉమ్మడి జిల్లాలు ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతిలో పనిచేస్తున్న 60 శాతం ఉద్యోగులకు చిత్తూరులో, 30 శాతం ఉద్యోగులకు నెల్లూరులోను, 10శాతం ఉద్యోగులకు తిరుపతి కలెక్టరేట్‌లోను బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కార్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా బదిలీలు నిర్వహించాలని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. దీంతో జూన్ 30తో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ...బదిలీల్లో పారదర్శకత కొరవడడంతో పలువురు ఉద్యోగులు నాయ్యం కోసం రోడ్డెక్కారు. మరికొందరు కోర్టుమెట్లు ఎక్కడానికి సిద్ధం అవుతున్న క్రమంలో వాటిని సరిచేయాలనే ఉద్దేశంతో జులై 5 వరకు కౌన్సెలింగ్ గడువు పెంచారు. మేజర్‌గా జరిగిన తప్పులను సవరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కౌన్సెలింగ్ పూర్తి అయినప్పటికీ బదిలీల జాబితాను మాత్రం గోప్యంగా ఉంచారు. వెల్లడించడానికి మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందని చర్చ సాగుతోంది.
కుంటుపడుతున్న పాలన
రేషన్‌కార్డుల సవరణ కేంద్రాల్లో ఇక్కట్లు
సచివాలయాలు 691 నుంచి
353కు కుదింపు
స్తంభించిన పాలన
జిల్లాలో సచివాలయ పాలన నెల రోజులుగా స్తంభించిపోయింది. సచివాలయంలో అందిస్తున్న పలు సేవలు కుంటుపడ్డాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా రేషన్ కార్డుల సవరణ కోసం ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 8 సచివాలయాల్లో చేసుకోవడానికి వీలుగా నెల రోజుల క్రితం కేంద్రాలను కేటాయింపు చేశారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 55 వేల దరఖాస్తులను అందుకున్నారు. ప్రధానంగా చిరునామా మార్పుల కోసం 2490, ఆధార్ సవరణ 660, కార్డులో సభ్యుల చేరిక కోసం 39,050, సభ్యుల తొలగింపునకు 1360, కొత్త కార్డుల కోసం 7262, కార్డుల విభజన కోసం 4581, ప్రభుత్వానికి సరెండర్ చేసిన కార్డులు 34 ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే ఈ కేంద్రాలు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నేపథ్యంలో వేగవంతంగా ముందుకు సాగడం లేదని పలువురు వాపోతున్నారు. బదిలీలు పూర్తి చేస్తే...కొత్త ఉద్యోగులైన వచ్చి వారి పనులు వారు చేసుకుంటారని అంతా చర్చించుకుంటున్నారు.