
బాల్యం నుంచే అల్లూరికి దేశభక్తి
● మన్యం వీరుడికి కలెక్టర్, ఎస్పీ నివాళులు
తిరుపతి అర్బన్ : చిన్నతనం నుంచే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు దేశభక్తి ఉండేదని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అల్లూరి 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. 1897 జులై 4న సూర్యనారాయణమ్మ, వెంకటరామరాజు దంపతులకు జన్మించారని, అల్లూరి సీతారామరాజుకు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నిత్యం ధ్యానం, దైవపూజతో జీవనశైలి కొనసాగించిన ఆయన, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తుచేశారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను తెలుసుకున్న ఆయన తెల్లదొరల రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజల్లో చైతన్యం నింపి, వారికి ధైర్యసాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారని చెప్పారు. ఆయన త్యాగం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్‌మాండ్, సుధారాణి పాల్గొన్నారు.
తిరుపతి క్రైమ్ : స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పించారు.