
11 మంది ఉద్యోగ విరమణ
తిరుపతి క్రైమ్: జిల్లాలో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలు అందించిన 11 మంది పోలీసులు సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. అందులో పీసీల నుంచి ఎస్‌ఐల వరకు అన్ని స్థాయిల వారూ ఉన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ రవి మనోహరాచారి ఘనంగా సత్కరించారు.
షార్ట్ సర్క్యూట్‌తో వాహనాలు దగ్ధం
తిరుపతి క్రైం: రేణిగుంట రోడ్‌లోని ఓ బైక్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో వాహనాలు దగ్ధమైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తిరుపతి అగ్నిమాపక శాఖ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి కథనం మేరకు, రేణిగుంట – తిరుపతి మార్గంలో ఉన్న జాయ్ ఈ బైక్స్‌లో ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఒక బైక్ నుంచి మంటలు వచ్చి, మరో 10 వాహనాలకు వ్యాపించాయి. ఈ క్రమంలో 11 బైకులు, ఒక ల్యాప్‌టాప్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. రూ.20 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక విచారణలో తేలింది అన్నారు. అయితే ఈ షో రూమ్ లో మొత్తం వాహనాలు కాలిపోవడంతో యాజమాని రాజశేఖర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపు చేయగలిగారు.
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
చిల్లకూరు: గూడూరులో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ ప్రేమ జంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గూడూరు రూరల్ పోలీసులను సోమవారం ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు గూడూరు మండలం చెన్నూరుకు చెందిన రామతేజ, శ్రీకాళహస్తికి చెందిన సాయి దీపిక ఒకే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరు కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాలుు వీరి ప్రేమను అంగీకరించలేదు. ఈ జంట పోలీసులను ఆశ్రయించడంతో వారు రెండు కుటుంబాల వారిని పిలిపించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పి పంపించేశారు.
మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలి
తిరుపతి సిటీ: తెలుగు విద్యార్థులకున్న విభిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందాలని రచయిత ఆర్‌సి.కృష్ణస్వామి రాజు సూచించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలుగు సాహితీ సమితి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. తెలుగు కథా సాహిత్యం గ్రామీణ జీవితం అనే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలుగు విద్యను అభ్యసించడానికి ప్రస్తుత తరం వెనకడుగు వేస్తున్నారని, తెలుగు సాహిత్యం చదవాలంటే ఎంతో అదృష్టం ఉండాలని తెలిపారు. తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ కృష్ణస్వామి రాజు తన చుట్టూ ఉన్న పల్లె జీవితాలను, తాను చూసిన విషయాలను రచనల రూపంలో ప్రజలకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై సుభాషిణి, సాహితీ సమితి అధ్యక్షులు ఎ ప్రనూష, ఉపాధ్యక్షులు జి వాణి, కార్యదర్శి బి. శిరీష, కోశాధికారి ఎ మోహిత డాక్టర్ లక్ష్మిప్రియ, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

11 మంది ఉద్యోగ విరమణ

11 మంది ఉద్యోగ విరమణ

11 మంది ఉద్యోగ విరమణ