
పోలీస్ గ్రీవెన్స్‌కు 88 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 88 ఫిర్యాదులు అందినట్టు ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
యువకుడి ఆత్మహత్య
సైదాపురం: కువైట్‌కు వెళ్లి ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుని తల్లి కాకాణి లక్ష్మమ్మ అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్‌ఐ క్రాంతి కుమార్ కథనం మేరకు మండకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కాకాణి వెంకటరమణయ్య (35)కు అదేకాలనీకి చెందిన భాగ్యమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి ఇద్దరు కుమారుల్లో ఒకరు గతంలో మృతి చెందారు. బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లి వారం క్రితమే వచ్చాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యా యి. ఈ క్రమంలో వెంకటరమణయ్య ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వ్యభిచారం కేసులో
ఇద్దరి అరెస్ట్
తిరుపతి క్రైమ్: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం చేస్తూ ఇద్దరు పట్టుబడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. అలిపిరి సీఐ రామ కిషోర్ కథనం మేరకు, ఉపాధ్యాయ నగర్‌లోని మహేందర్ నివాస్ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే సిబ్బందితో దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిర్వాహకురాలితోపాటు జైచంద్ర అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2000 నగదు, కండోమ్‌లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.