
గందరగోళంగా సర్వేయర్ల బదిలీలు
● ముడుపులు తీసుకుని బదిలీలు చేశారనే ఆరోపణలు ● తప్పిదాల కారణంగా రెండు గంటల పాటు ఆగిన కౌన్సెలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ సచివాలయ సర్వేయర్ అసిస్టెంట్ల బదిలీలు గందరగోళంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సర్వే అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించారు. చిత్తూరు సర్వే శాఖ ఏడీ జయరాజ్ ఆధ్వర్యంలో సర్వే అసిస్టెంట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి సర్వేశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళంగానే సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 398 సర్వేయర్ అసిస్టెంట్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. చాలా మందికి అన్యాయం జరగడంతో కలెక్టరేట్ భవనంలో అరుపులు.. కేకలు వినిపించాయి. న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు.
వెల్లువెత్తిన ముడుపుల ఆరోపణలు
సర్వే అసిస్టెంట్ల బదిలీల్లో పలువురికి అనుకూలమైన స్థానాలను కేటాయించేందుకు సర్వేశాఖ అధికారులు ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో పోస్టింగ్ నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు స్వీకరించారని కౌన్సెలింగ్‌కు విచ్చేసిన సర్వే అసిస్టెంట్లు ఆరోపించారు. జిల్లాల పునర్‌విభజన కారణంగా ఆయా జిల్లాల సర్వే అసిస్టెంట్లకు ప్రత్యేకంగా బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాలి. అయితే సర్వే శాఖ అధికారులు అలా చేయకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వే అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ప్రదర్శించి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. దీంతో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 120 మంది తిరుపతి జిల్లాకు బదిలీ అయినట్టు సమాచారం. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సర్వే అసిస్టెంట్లు చిత్తూరు జిల్లాకు బదిలీ కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
సీనియారిటీలో అవకతవకలు
సీనియారిటీ జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసుకోవాల్సిన సర్వే శాఖ అలసత్వం వహించింది. ఆ జాబితా రూపకల్పనలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఒకే ర్యాంక్‌ను ఇద్దరు సర్వేయర్లకు కేటాయించారు. అలా ఎలా కేటాయిస్తారని సర్వే అసిస్టెంట్లు అధికారులను ప్రశ్నించారు. కనీసం జాబితా ప్రచురించకుండా కౌన్సెలింగ్ నిర్వహించారని ఆరోపించారు. ఈ తప్పిదాల కారణంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏడీ ప్రకటించారు. సీనియారిటీ జాబితాలో తప్పిదాలు చోటుచేసుకున్నాయని స్వయంగా ఏడీనే ప్రకటించారు. దీంతో రెండు గంటల పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేటప్పుడు సీనియారిటీ, ఖాళీల జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని సర్వే అసిస్టెంట్లు ప్రశ్నిస్తున్నారు.