
మా పిల్లలను బడికి రావద్దన్నారు
తిరుపతి అర్బన్: మూడు దశాబ్దాల క్రితం 6 లేదా 7 పంచాయతీలకు ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది. ఆ తర్వాత మారుతున్న కాలానుగుణంగా విద్యను అందరికీ అందించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ప్రతి గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసేలా కృషి చేశారు. దీంతో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గడంతోపాటు అక్షరాస్యత పెరుగుతూ వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం మళ్లీ క్లస్టర్ల (విలీనం) పేరుతో 6 లేదా 7 గ్రామాలకు ఒక పాఠశాలను ఏర్పాటు చేయడంపై రగిలిపోతున్నారు.
రాజుగుంట ఎస్సీకాలనీ వాసుల నిరసన
శ్రీకాళహస్తి మండలం యార్లపూడి పంచాయతీలో ఉన్న రాజుగుంట ఎస్సీకాలనీలో మూడు దశాబ్దాలుగా ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే క్లస్టర్ పేరుతో మోడల్ స్కూల్ అంటూ మన్నవరంలో ఉన్న పాఠశాలలో విలీనం చేసేశారు. ఇక నుంచి విద్యార్థులు అక్కడికి వెళ్లాలని ఉపాధ్యాయులు తేల్చి చెప్పేశారు. 3, 4, 5 తరగతుల పిల్లలు ఈ పాఠశాలకు రావద్దని స్పష్టం చేశారు. అటవీ సమీపంలో ఉన్న మన్నవరం పాఠశాలకు చిన్నపిల్లలను ఎలా పంపుతారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాలను తమ కాలనీలోనే కొనసాగించాలని సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
మా పాఠశాలను మూసివేయొద్దు
ఏర్పేడు: మండలంలోని ఎండీ పుత్తూరు పాఠశాలను మూసివేయొద్దని సర్పంచ్ మోహన ప్రియ డీఈవోకు విన్నవించారు. ఆమె గ్రామస్తులతో కలిసి సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఎండీ పుత్తూరు నుంచి పక్క గ్రామ పాఠశాలకు చిన్న పిల్లలు వెళ్లి రావడం కష్టంతో కూడుకున్నదని, మూడు కిలోమీటర్ల మేర పిల్లలు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. పాఠశాల విలీన ప్రక్రియను నిలుపుదల చేసి ఇక్కడి పాఠశాలను ఇక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జలజ, గ్రామస్తులు పాల్గొన్నారు.
మా పాఠశాలలను కొనసాగించాలి
సత్యవేడు: మండలంలోని పేరడం ప్రాథమిక పాఠశాలను యధావిధిగా ఉంచాలని గ్రామస్తులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ పాఠశాలను మదనం బేడు పాఠశాలలో విలీనం చేయవద్దని కోరారు. సుమారు రెండు కిలోమీటర్లు దూరం పిల్లలు వెళ్లలేరని విన్నవించారు.
అముడూరు గ్రామస్తుల ఆందోళన
ఏర్పేడు : మండలంలోని అముడూరు గ్రామంలో 1960 నుంచి ఉన్న పాఠశాలను మూసివేయడంతో వారు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. మండలంలోని పాగాలి గ్రామంలోనూ పాఠశాల విలీనం ప్రక్రియపై పిల్లలు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలను చదువులకు దూరం చేయొద్దని కోరారు.

మా పిల్లలను బడికి రావద్దన్నారు