రూ.కోట్ల జాగాపై కన్ను
● తిరుపతి మున్సిపల్ స్థలాన్ని విక్రయించేందుకు భారీ స్కెచ్ ● గాంధీ విగ్రహం సమీపంలో కార్పొరేషన్‌కు ఖరీదైన స్థిరాస్తి ● ఓ మంత్రి అండదండలతో అమ్మకానికి సిద్ధమైన యంత్రాంగం ● విధి విధానాలు లేకుండా కౌన్సిల్ ఆమోదానికి సన్నద్ధం
తిరుపతి తుడా : తిరుపతి నడిబొడ్డున అభివృద్ధి చెందిన ప్రాంతమది. ఇక్కడ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన రూ.110 కోట్లకు పైగా విలువ చేసే కమర్షియల్ స్థలం ఉంది. ఈ స్థలానికి కూత వేటు దూరంలో ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్, ప్రసిద్ధి చెందిన మోడ్రన్ రైల్వే స్టేషన్, ప్రముఖ గోవిందరాజస్వామి ఆలయం ఉన్నాయి. ఇదే స్థలంలో 1965లోనే మున్సిపాలిటీ స్థాయిలో విశ్రాంతి అతిథి గృహంగా దశాబ్దాల పాటు సేవలందించింది. ప్రస్తుతం ఈ స్థలంపై కూటమి ప్రభుత్వం కన్నుపడింది. కోట్ల విలువ చేసే ఈ స్థలంపై భారీ స్కెచ్ వేసి తక్కువ ధరకే కొట్టేసేందుకు కుట్రకు తెరలేపారు. ఇందుకు అధికారులు వత్తాసు పలుకుతూ అమ్మకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఖరీదైన స్థలాన్ని విక్రయించేందుకు అధికారులు, పాలకులు కుమ్మకై భారీ స్కెచ్ వేశారు. తిరుపతి నడిబొడ్డున గాంధీ విగ్రహానికి దక్షిణం, ఈస్ట్ పోలీస్టేషన్‌కు ఆనుకుని తూర్పు వైపున 77 సెంట్ల కమర్షియల్ భూమి కార్పొరేషన్‌కు ఆర్థిక స్థిరాస్థి వనరుగా ఉంది. ఈ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రి ఒకరు ఎత్తులు వేశారు. కార్పొరేషన్ నూతన భవనాన్ని నిర్మించుకునేందుకు నగదు లేనందున ఈ స్థలాన్ని విక్రయించి తద్వారా వచ్చే డబ్బుతో పనులు పూర్తి చేయాలని సాకుగా చూపుతున్నారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని కూటమిలోని ఓ వర్గం వాపోతోంది. ఆ స్థలాన్ని ఎలాగైనా కాజేసి విద్యాసంస్థలకు అనుకూలంగా భవనాన్ని నిర్మించుకోవాలన్న ఎత్తుగడకు అధికారులు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. రూ.కోట్లు విలువ చేస్తే ఈ స్థలాన్ని అమ్మకానికి పెట్టి నామమాత్రపు ధరతో కొట్టేసేందుకు ఇప్పటికే ఎత్తులు వేశారు. ఇందుకు అనుగుణంగానే బుధవారం నిర్వహించే కౌన్సిల్‌లో అతి చిన్న అజెండాగా ప్రతిపాదన పెట్టి ఆమోదం పొందేలా పావులు కదుపుతున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక తరహాలో కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి అడ్డదారిలోనైనా కౌన్సిల్ ఆమోదం పొందేలా కుయుక్తులు పన్నుతున్నారు.
ఊసేలేని స్మార్ట్ సిటీ నిధులు
తిరుపతి స్మార్ట్ సిటీకి కాలం చెల్లింది. ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విదల్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీని రద్దు చేసింది. కేంద్రం నుంచి రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.310 కోట్లు తిరుపతి స్మార్ట్ సిటీకి విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కానీ కేంద్రం ఆ నిధులను ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితులలో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్రం స్మార్ట్ సిటీకి మంగళం పలికింది. ఈ క్రమంలో సుమారు రూ.500 కోట్లకు పైగా జరుగుతున్న అభివృద్ధి పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణం 40 శాతం పనులు పూర్తి చేసుకుని ఆగిపోయాయి. ఈ పనులు పూర్తి చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన స్థిరాస్తిని అమ్మడం తప్ప మరో మార్గం లేదంటూ ఓ మంత్రి అధికారుల చేత చెప్పించారు. ఆయనకు వంతపాడుతున్న అధికారులు ఈ స్థలాన్ని అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. బుధవారం నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో తూతూ మంత్రంగా ఆమోద ముద్ర వేయించి ఆపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
అమ్మకానికి పెట్టిన మున్సిపల్
కార్పొరేషన్ ఖరీదైన స్థలం
స్థలం : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్
స్థలం ఎక్కడంటే : గాంధీ విగ్రహం దక్షిణం వైపు
విస్తీర్ణం : 77 సెంట్లు (924 అంకనాలు)
సబ్ రిజిస్ట్రార్ విలువ (ఒక అంకనం) : రూ. 2.40 లక్షలు
ప్రస్తుత మార్కెట్ విలువ (అంకనం) : సుమారు రూ.12 లక్షలు
924 అంకనాలకు ప్రస్తుత విలువ: రూ.110 కోట్లకు పైమాటే
ప్రభుత్వ ఆస్తిని చౌకగా కొట్టేసేందుకు..
గాంధీ విగ్రహం సమీపంలోని మున్సిపల్ స్థలాన్ని కొట్టేసేందుకు గత టీడీపీ ప్రభుత్వంలోనే కొందరు ఎత్తులు వేశారు. ఆ ఎత్తులను అప్పటి వైఎస్సార్‌సీపీ నేతలు తిప్పికొట్టడంతో లీజు విషయాన్ని పక్కన పెట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ స్థలాన్ని కొట్టేసేందుకు కుట్ర పన్నారు. ఓ మంత్రి అంతా తానై రూ.కోట్ల విలువ చేసే మున్సిపల్ స్థిరాస్థిని కాజేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే కౌన్సిల్ ఆమోదంలో వేలం పాట ప్రారంభ ధరను నిర్ణయించకుండా ఎత్తులు వేశారు. తీరా వేలం పాటలో ఎవరూ పాల్గొనకుండా అనుకున్న వాళ్లకు ఆ స్థలాన్ని తక్కువ ధరకే కొట్టేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ విలువ అంకనం రూ.2.40 లక్షలు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో దాని విలువ అంకనం రూ. 12 లక్షల వరకు పలుకుతోంది. అలా 924 అంకనాల విస్తీరణం గల స్థలాన్ని బహిరంగం మార్కెట్ ప్రకారం విక్రయిస్తే రూ.110.88 కోట్లు వరకు కార్పొరేషన్‌కు సమకూరుతుంది. అయితే కౌన్సిల్ ఆమోదంలో వేలం పాట ప్రారంభ ధర నిర్ణయించకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు
కార్పొరేషన్ స్థలాన్ని విక్రయానికి పెట్టడంపై సోషల్ మీడియాలో కూటమి నేతలు, అధికారుల తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మడమేనా సంపద సృష్టి బాబూ...అంటూ కొందరు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. అధికారుల తీరుపైనా మండి పడుతున్నారు. స్మార్ట్ సిటీ నిధులు విడుదల చేస్తే స్థిరాస్తిని అమ్మె దుస్థితి ఉండదు కదా...బాబూ అంటూ సైటెర్లు వేస్తున్నారు. అలానే మంత్రి నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆస్తులను అమ్మితే ఒప్పుకునేది లేదంటూ వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు కమ్యూనిస్టు పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.
విధి విధానాలు లేకుండా...
టెండర్‌కు వెళ్లాలంటే అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ స్థలాన్ని విక్రయించాల్సినప్పుడు కౌన్సిల్‌లో అజెండాగా పెట్టే ముందు నిపుణులతో చర్చించాలి. సబ్ రిజిస్ట్రార్, ఆర్డీఓ, స్థానిక రెవెన్యూ అధికారులతో సమావేశమై ఆ స్థలానికి సంబంధించి ప్రభుత్వ విలువ ఎంత ? బహిరంగ మార్కెట్‌లో దాని వాస్తవ విలువ? టెండర్‌కు వెళ్లాలంటే సర్కార్ వారి పాట ప్రారంభ ధర ఎంత అని నిర్ణయించాల్సి ఉంది. ఇవేమీ లేకుండానే సరైన విధి విధానాలు రూపొందించకుండా ఆ స్థలాన్ని అమ్మేందుకు ప్రభుత్వ అనుమతి కోసం కౌన్సిల్ ఆమోదం అంటూ చిన్న అజెండా పెట్టడం విమర్శలకు తావిస్తోంది.


