వైఎస్ జగన్ దృష్టికి కళత్తూరు సమస్యలు
వరదయ్యపాళెం: కేవీబీపురం మండలంలో ఇటీవల రాయలచెరువు తెగి ముంపునకు గురైన కళత్తూరు గ్రామ సమస్యలను తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తితో కలసి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముంపు సమయంలో జరిగిన నష్ట పరిస్థితులను తెలిపారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంటా జరిగిన నష్టం, పంట నష్టం, కోతకు గురైన పొలాలను గురించి వివరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు వివరాల గురించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. అలాగే వరద బాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ గట్టిగా నిలబడాలని, తప్పకుండా న్యాయం చేసే వరకు వారి పక్షాన పోరాడాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తిని, సమన్వయకర్త రాజేష్‌కు సూచించినట్లు సమాచారం.
నిధులు వృథా చేస్తే చర్యలు
తిరుపతి అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేసి, వృథా చేసే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా పంచాయితీ అధికారి(డీపీఓ) సుశీలాదేవి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లోని తమ చాంబర్ నుంచి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు 2025–26కు సంబంధించి మొదటి విడతలో రూ. 32,24,48,796 మంజూరు చేశారన్నారు. అయితే జిల్లాలో 774 పంచాయతీలు ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగిన 744 పంచాయతీలకు మాత్రమే నిధులు విడుదల చేశారని వెల్లడించారు. ఈ నిధులను తాగునీటి అవసరాలు, చేతిపంపులు, నీటి ట్యాంకులు, మోటార్ల నిర్వహణకు, పారిశుద్ధ్యానికి వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
నేటితో ముగియనున్నపది పరీక్షల ఫీజు గడువు
తిరుపతి సిటీ: జిల్లాలో ఇప్పటి వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థులు రూ.500ల అపరాధ రుసుముతో శనివారంలోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిందని, ఇదే చివరి అవకాశమని వెల్లడించారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తక్షణం ఫీజు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నేడు, రేపు సైన్స్ ఎగ్జిబిషన్
తిరుపతి రూరల్ : ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో తిరుపతిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్పీ డీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. తిరుపతి పాత తిరుచానూరు రోడ్డు లోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఎగ్జిబిషన్‌ను ఏ ర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదు వుతున్న విద్యార్థులకు స్టాల్స్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. స్టాల్స్ విజేతలతోపాటు సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో విజేతలకు ఈ నెల 21న రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవం నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు. తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్న జీయర్‌స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు.
వైఎస్ జగన్ దృష్టికి కళత్తూరు సమస్యలు


