బిడ్డ శవాన్ని మంత్రగాళ్లు ఎత్తుకెళతారని..
చంద్రగిరి: అనారోగ్యంతో వారం రోజుల కిందట ఓ బాలుడు(6) మృతి చెందగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తి చేశారు. అయితే తన బిడ్డ మృతదేహాన్ని మంత్రగాళ్లు ఎక్కడా తీసుకెళ్లిపోతారోనని, ఆ తండ్రి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళితే.. చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లికి చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో వారం కిందట మృతి చెందాడు. అనంతరం బాలుడి శవానికి గ్రామ పొలిమేరలోని శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే బాలుడు తమకు మొదటి సంతానం కావడంతో క్షుద్రపూజల కోసం మంత్రగాళ్లు మృతదేహాన్ని తీసుకెళతారని తండ్రికి అనుమానం వచ్చి కొద్దిరోజుల పాటు రోజుకు రూ.1500 చొప్పున డబ్బు ఇచ్చి నిఘా పెట్టాడు. ఆపై ఆర్థిక భారం అధికం కావడంతో తానే కాపలాగా ఉంటూ వచ్చాడు. చివరకు సమాధి వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిత్యం సెల్‌ఫోన్ ద్వారా తన కుమారుడి సమాధిని పర్యవేక్షిస్తున్నాడు. తన బిడ్డపై ఉన్న మమకారంతో తండ్రి చూపిస్తున్న ప్రేమకు గ్రామస్తులు సైతం కంట తడిపెట్టారు.


