● కొరవడిన పర్యవేక్షణ ● ప్రాజెక్ట్‌కు పొంచిఉన్న ముప్పు ●
రాపూరు/సైదాపురం: మండలంలో తెలుగుగంగ పథకంలో భాగంగా నిర్మించిన కండలేరు జలాశయంపై పర్యవేక్షణ లోపించడంతో శిథిలావస్థకు చేరుతోంది. కనీసం మరమ్మతులు చేపట్టకపోవడడంతో ప్రాజెక్ట్‌కు మనుగడకు ముప్పువాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయం హెడ్ రెగ్యులేటర్ల షట్టర్లు పాడైపోవడంతో హుటాహుటిన నిపుణుల కమిటీ పర్యవేక్షించింది. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గితేనే మరమ్మతు చేసేందుకు వీలుంటుందని నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. దీంతో నిండుకుండలా ఉన్న కండలేరు జలాశయంపైనే సాగు చేసే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత మరమ్మతులు చేపట్టకపోతే జలాశయం మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి.
కాలువలకు నీరు విడుదల
కండలేరు జలాశయం నుంచి సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు నియోజక వర్గాల్లోని చెరువులకు ఏటా కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం కండలేరులో 60 టీఎంసీలు నీరు నిల్వ చేస్తారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,160 క్యూసెక్కులు, పిన్నేరు కాలువకు 20 క్యూసెక్కులు, హైలెవల్ కాలువకు 100, లోలెవల్ కాలువకు 50 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్ కెనాల్‌కు 75 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నారు. దీంతో కండలేరు నుంచి చెరువులకు సాగునీరు వస్తుంది. ప్రస్తుతం కండలేరు జలాశయంలో పుష్కలంగా నీరు ఉండడంతో రబీ సీజన్‌పైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు.
అవసరం ఇలా..
కండలేరు జలాశయం పరిధిలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం రబీ సీజన్‌లో సాగునీటి అవసరాలకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
మట్టికట్టపై అడవిని తలపిస్తున్న కర్ర తుమ్మ
కండలేరు జలాశయం మట్టికట్టపై రెండేళ్లుగా చెట్లును తొలగించకపోవడంతో అడవిలా తయారైంది. ఇటీవల కురిసిన మెంథా, దిత్వా తుపాన్‌లతో కురిసిన భారీ వర్షాలకు జలాశయంలోకి పూర్తిగా నీరు చేరడంతో అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఏటా మట్టికట్టపై ఉన్న కర్ర తుమ్మ చెట్లను తొలగించి, కట్టను బాగు చేస్తుండేవారు. అయితే రెండేళ్ల నుంచి అలాంటి జాడ లేకపోవడంతో కట్టకు కూడా పెను ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్లూయిజ్ వద్ద కూడా కంప పెరిగిపోవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు.
నిపుణుల కమిటీ పరిశీలన
కండలేరు జలాశయాన్ని గత రెండేళ్ల క్రితం నిపుణుల కమిటీ పరిశీలించింది. కండలేరు జలాశయం నిర్మాణం చేపట్టి సుమారు 30 ఏళ్లు పూర్తి కావస్తుందని, మట్టికట్టను వెడల్పు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆ నివేదిక కార్యరూపం దాల్చలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కండలేరు జలాశయాన్ని డిసెంబర్ 17వ తేదీన నిపుణుల కమిటీ పరిశీలించింది. లీకేజీ సమస్య, గేట్లు ఎత్తే సమయంలో గేట్లు పైకి లేవడంలేదని అక్కడి సిబ్బంది కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం జలాశయంలో 60 టీఎంసీల నీరు ఉండడంతో లీకేజీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం కష్టమని తెలిపారు. నీరు తగ్గిన తరువాత వచ్చి మరోసారి పరిశీలించి లీకేజీ సమస్య పరిశీలించగలని నిపుణుల బృందం తేల్చి చెప్పింది.
దేశ చరిత్రలోనే ఖ్యాతి..
కండలేరు జలాశయం
దేశంలో ఎక్కడ లేని విధంగా 10.758 కి.మీ. పొడవున మట్టికట్టను నిర్మించారు. ఇంత పెద్ద మట్టికట్ట ఆసియా ఖండంలో మరొకటి లేకపోవడం విశేషం. జలాశయంలో భాగంగా కండలేరు అతిథిగృహం, కండలేరు హెడ్‌రెగ్యులేటర్, పవర్‌స్లూయిస్, అప్రోచ్ చానల్స్ నిర్మించారు. 1983లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎన్‌టీరామారావు, ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ జలాశయంలో 68 టీఎంసీల నీరు నిల్వ ఉంచి చైన్నె, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీరు అందిచేందుకు ఈప్రాజెక్టు నిర్మించారు. 10.758 కిలోమీటర్ల పొడవు, 49 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పుతో మట్టికట్ట నిర్మించారు. 1984లో ప్రారంభమైన ఈ పనులు 1996 వరకు కొనసాగాయి, 22 గ్రామాలు జలాశయంలో ముంపునకు గురయ్యాయి, 2021 లో 61.03 టీఎంసీల నీరు నిల్వ చేశారు.
దెబ్బతిన్న హెడ్ రెగ్యులేటర్ గేట్లు
కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లు పలుసార్లు మరమ్మతులు చేశారు. కానీ హెడ్ రెగ్యులేటర్ వద్ద కొన్నేళ్లుగా లీకేజీ సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో పలుసార్లు నిపుణుల కమిటీ పరిశీలించింది. అయినా లీకేజీని అరికట్టలేకపోయింది. అలాగే సకాలంలో గేట్లు ఎత్తడంతో సిబ్బంది కొంతమేర కష్టపడుతుంటారు. జలాశయం నుంచి నీరు విడుదల చేసే సమయంలో గేట్లు పైకి ఎత్తడం కష్టంగా మారుతుంది. ప్రైజర్ ద్వారా గేట్లు ఎత్తుతుంటారు. కండలేరు జలాశయంలోని హెడ్ రెగ్యులేటర్‌కు 2014–15 సంవత్సరంలో రూ.కోటి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో రోప్, బేరింగ్ తదితర పరికరాల మరమ్మతుకు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2024–25 సంవత్సరంలో కండలేరు గేట్లకు రూ.67 లక్షలు నిధులు మంజూరు చేయడంతో గేట్లు మరమ్మతులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రవాహవేగంతోనే
జలాశయం 391 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్నప్పటికీ దీని పరిధిలో వచ్చే వర్షపు నీరు 3 టీఎంసీలు మాత్రమే. మిగిలిన నీరు కృష్ణా, పెన్నా నదుల నుంచి జలాశయానికి తరలిస్తారు. కండలేరు జలాశయం హెడ్‌రెగ్యులేటర్ నుంచి 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూండి (చైన్నె) జలాశయానికి ప్రతి సంవత్సరం 12 టీఎంసీల తాగునీరు విడుదల చేయాల్సి ఉంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు, ఈ జిల్లాల ప్రజలకు తాగునీరు అందిస్తారు.
నీరు తగ్గిన తరువాత మరమ్మతులు చేస్తాం
కండలేరు జలాశయం హెడ్‌రెగ్యులేటర్ వద్ద గేట్లు గత 30 ఏళ్ల కిందట నిర్మించారు. ప్రతిసారి నీళ్లు వదిలే సమయంలో గేట్లు ఎత్తుతూ దించుతూ ఉండడంతో కొంతమేర దెబ్బతిని ఉండవచ్చు. అలాగే కాంక్రీట్ వాల్ కూడా దెబ్బతిని ఉంటుందని నిపుణుల కమిటీ సూచించింది. నీళ్లు తగ్గిన తరువాత నిపుణుల కమిటీ, ఉన్నతాధికారుల సూచన మేరకు మరమ్మతులు చేపడతాం.
–అనిల్‌కుమార్, ఏఈ, తెలుగుగంగ
● కొరవడిన పర్యవేక్షణ ● ప్రాజెక్ట్‌కు పొంచిఉన్న ముప్పు ●
● కొరవడిన పర్యవేక్షణ ● ప్రాజెక్ట్‌కు పొంచిఉన్న ముప్పు ●
● కొరవడిన పర్యవేక్షణ ● ప్రాజెక్ట్‌కు పొంచిఉన్న ముప్పు ●


