ప్రభుత్వ భూములు.. ప్రైవేటు ఆసాములు
అడిగేవారు.. అడ్డుకునే వారులేరని..ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమించేశారు. ఆపై వాటికి ఫెన్సింగ్ వేసుకుని, నకిలీ పత్రాలు సృష్టించి, తమ సొంతం చేసుకున్నారు. అడ్డొచ్చిన గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు సైతం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడంతో సర్కారు స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది.
రామచంద్రాపురం: మండలంలోని రాయలచెరువు పరిసరాల్లో ప్రభుత్వ భూములపై రాబందులు పడి అందినకాడికి ఆక్రమించేసుకుంటున్నారు. అడ్డొచ్చిన గ్రామస్తులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ రాక్షసుల్లా వ్యవహరిస్తుండం మండలంలో చర్చనీయాంశమైంది. రామచంద్రాపురం మండలానికి చెందిన మండల మాజీ నాయకుడొకరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారంటూ రెండు రోజుల క్రితం గ్రామస్తులతో కలిసి కూటమి నేతలు ఆందోళనకు దిగారు. అటవీ భూమి ఆక్రమిత స్థలంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, హద్దు రాళ్లను పడగొట్టారు. రాయలచెరువు లెక్కల దాఖలాలో సర్వే నంబర్లు 410/1, 410/6, 409/1 పరిధిలో నాలుగు ఎకరాలకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, ఏకంగా 30 ఎకరాల అటవీ భూమిని చదును చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నకిలీ పట్టాలను గుర్తించిన అధికారులు
మండలంలోని ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కబ్జా చేయడంపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు విచారణ చేపట్టారు. పట్టాలను పరిశీలించిన అధికారులు ఇవి పూర్తిగా బోగస్ పట్టాలని నిర్ధారించి, పనులను అడ్డుకున్నారు. ప్ర స్తుతం కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో రాబందుల్లా ప్రభుత్వ భూములపై వాలిపోయారు.
మంత్రి అనుమతి ఉందంటూ బెదిరింపు
ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న ఆ పార్టీ నేత తమకు మంత్రి అండదండలు ఉన్నాయంటూ అధికారులు, ప్రజలను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమణకు అండగా 70 మందికి పైగా మద్దతుదారులు ఉన్నారని, ఆక్రమణదారుడు వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు కలిసి పనులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ప్రభుత్వ భూములు.. ప్రైవేటు ఆసాములు
ప్రభుత్వ భూములు.. ప్రైవేటు ఆసాములు


