సిండికేట్ కబంధహస్తాల్లో గనులు
● కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ ● ప్రభుత్వ ఆదాయానికి రూ.వందల కోట్ల గండి ● సైదాపురం మండలంలో యథేచ్ఛగా దందా
సాక్షి, టాస్క్‌ఫోర్స్:సైదాపురం మండలంలోని క్వార్జ్ గనుల్లో యథేచ్ఛగా అక్రమం మైనింగ్ సాగుతోంది. కూటమి నేతల కనుసన్నల్లో సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. సిండికేట్‌కు కప్పం కట్టిన వారికి మాత్రమే మైనింగ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కాసులు చెల్లించని వారి గనులకు మాత్రం అనుమతులు నిరాకరిస్తున్నారు. దీంతో మైనింగ్ ఆదాయం 90 శాతం మేర పడిపోయింది. మరోవైపు పచ్చ నేతలు మాత్రం ఎక్కడికక్కడ గనులను స్వాధీనం చేసుకుని రూ.కోట్లు గడిస్తున్నారు. ఇదంతా కూటమి ముఖ్యనేత నేతృత్వంలోనే జరుగుతుండడం గమనార్హం. 12 నెలలుగా కూటమి నేతలు క్వార్జ్ , మైకా క్వార్జ్ గనులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఖనిజాలను సిండికేట్‌కే అప్పగించాలనే షరతులతో గనుల యజమానులు తవ్వకాలు చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేయడం విశేషం.
త్రిమూర్తులకే అనుమతులు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిండికేట్ ఏర్పడిన తర్వాత వారికి అనుకూలంగా ఉన్న ముగ్గురు యజమానులదే హవాగా కొనసాగుతోంది. వారికి సుమారుగా 14 గనులుండడం విశేషం. దీంతో వీరు చెప్పిదే వేదంగా నడుస్తోంది. వీరి గనుల నుంచి నిత్యం రవాణా కొనసాగుతుంది. ప్రస్తుతం అనుమతులు పొందిన ఈ మూడు కంపెనీలకు చెందిన వారే అధికంగా ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అధికారులకు నెలవారీ వాటాలు
సిండికేట్ అనుమతులు పొందిన వారు ఇష్టానుసారంగా ఖనిజాలను తరలించేస్తున్నారు. ఇందుకోసం కొన్ని శాఖల అధికారులకు నెలవారీ వాటాలు చేరుతున్నట్లు సమాచారం. అధికారులు పట్టించుకోకపోవడతో అక్ర మార్కులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. వారికి కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
గతంలో రూ.50 వేలు.. ఇప్పుడు రూ.20 వేలే..
ప్రధానంగా మొదటి నుంచి ఇక్కడ దొరికే ఖనిజాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటిని జపాన్, చైనా దేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. అప్పట్లో గని యజమానుల నుంచి ఎగుమతి దారులే టన్ను రూ.50వేల వంతున కొనుగోలు చేసేవారు. ప్రస్తు తం టన్ను రూ.20 వేలకు కూడా కొనే వారు లేకపోవడంతో మైనింగ్ యజమానులు ఆందోళన చెందు తున్నారు.అది కూడా సిండికేట్‌కే ఇవ్వాల్సిన దుస్థితి.
ఆదాయానికి గండి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే రూ.250 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. మైనింగ్ పరిశ్రమ ద్వారా నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు రాయల్టీ రూపేణా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండేది. ఈ క్రమంలో ఏడాదిగా మైనింగ్ పరిశ్రమ కూటమి నేతల సిండికేట్ గుప్పిట్లోకి వెళ్లడంతో సర్కారు ఆదాయానికి గండిపడింబదని పలువురు వ్యాపారవేత్తలు ఆరోపిస్తున్నారు.
విదేశాల్లో మంచి గిరాకీ
సైదాపురం మండలంలో లభించే మైకా, క్వార్జ్‌కు విదేశాలల్లో మంచి గిరాకి ఉంది. దీంతో పలు దేశాల పారిశ్రామిక వేత్తలు ఈ ఖనిజాలను కొనుగోలు చేసుకునేందుకు పోటీ పడేవారు. ప్రస్తుతం మైనింగ్ మొత్తం రెండు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అవి కూడా ముఖ్యనేతవే కావడంతో వారు చెప్పిన ధరకే ఖనిజాలను ఇవ్వాల్సి ఉంది. వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో దాదాపుగా 140 ఓపెన్ కాస్ట్, 7 అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులున్నాయి. వాటిలో కప్పం కట్టడంతో పాటు ఖనిజాన్ని మీకే ఇస్తామన్న గనులకు మాత్రమే అనుమతులను మంజూరు చేశారు.
అధిక టన్నేజీతో రవాణా
సిండికేట్ అనుమతితో తరలిపోతున్న ఖనిజాలను అధిక టన్నేజీతో రవాణా చేస్తుండటం గమనార్హం. టిప్పర్లు, లారీలకు వేయాల్సిన టన్నేజీల కన్నా అధికంగా ఖనిజాలను నింపి ఎగుమతి చేస్తున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులతో పాటు మైనింగ్, పోలీసులు ఎలాంటిచర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిండికేట్ కబంధహస్తాల్లో గనులు
సిండికేట్ కబంధహస్తాల్లో గనులు


