
కనిపించని అభివృద్ధి పనులు
● వెలవెలబోతున్న సచివాలయాలు ● ఊసే లేని సంక్షేమ పథకాలు ● నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రాలు ● ఖాళీగా విలేజ్ వెల్త్ క్లినిక్‌లు ● అసంపూర్తిగా నాడు–నేడు పనులు ● కూటమి పాలనలో ప్రజలకు తప్పని ఆపసోపాలు
తిరుపతి అర్బన్/తిరుపతి సిటీ : మళ్లీ పాతరోజులొచ్చాయి. ఇంటి ముంగిటే అందుతున్న సేవలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. వలంటీర్ వ్యవస్థకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. చిన్నిచిన్న సేవలకు కూడా పట్నానికి పరుగులు తీయాల్సి వస్తోంది. వ్యయప్రయాసాలకోర్చి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లను గాలికొదిలేశారు. పేదలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సూపర్‌సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టేసింది. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి తూట్లు పొడిచింది. నాడు–నేడుతో రూపుదిద్దుకున్న పాఠశాలలను పట్టించుకోకుండా పోయింది.
సచివాలయాల్లో కానరాని సేవలు
గత ప్రభుత్వంలో జిల్లాలో 691 సచివాలయాల ద్వారా ప్రజలకు ఇంటివద్దకే సేవలందించేవారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి రేషన్ కార్డులు, ఆధార్‌తో పాటు ధ్రువీకరణ పత్రాలు ఇంటి వద్దే అందించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సచివాలయాల్లో సిబ్బందికి 32కు పైగా సర్వేలు అంటగట్టారు. దీంతో ఏ ఒక్కరూ సచివాలయం ముఖం చూడడం లేదు. ప్రజలు సచివాలయాలకు వెళ్లడం మానేసి గతంలో లాగే మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రు. సచివాలయాలు బోసిపోతున్నాయి. 442 రైతు భరోసా కేంద్రాలను 50 శాతం తగ్గించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించే నాథుడే లేకుండా పోయారు.
సూపర్ సిక్స్ హామీలు గాలికి
ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ అంటూ ఊదర గొట్టింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.1,500, తల్లికి వందనం పేరుతో కుటుబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు, ఉచిత బుస్సు, అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి ప్రతి రైతుకూ రూ.20 వేలు, ఏడాదికి 25 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధికింది నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికీ మంచినీటి కొళాయి, పేదల ఆదాయం రెట్టింపు అంటూ ప్రగల్భాలు పలికారు. గత ఏడాదిగా ప్రజలు ఎదురు చూస్తున్నా ఏ ఒక్క పథకాన్నీ అమలు చేయలేదు.
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలు
గత ప్రభుత్వం నిర్మించిన ఆరోగ్య కేంద్రాలు, పంచాయతీ భవనాలు, మల్టీపర్పస్ గోదాములు, రైతు సేవా కేంద్రాలు, సచివాలయ భవనాలు, పాఠశాలల మరమ్మత్తులు, నూతన భవనాలు, పశువైద్యశాలలు, విద్యార్థుల వసతిగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
తిరుపతి రూరల్ పరిధిలోని ఓ గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు తెరిచారు. తర్వాత ఒక్కొక్కరుగా సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఆ గ్రామానికి చెందిన ఒకరు రేషన్ కార్డు దరఖాస్తు కోసం రాగా.. సర్వర్ సహరించకపోవడంతో వెనుదిరిగాడు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలెవ్వరూ కనరాలేదు. మధ్యాహ్నం 2 గంటకు తర్వాత సచివాలయ సిబ్బంది కొందరు మండల కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా సచివాలయంలో ప్రజల తాకిడి లేదు. పథకాలు లేకపోవడం, గ్రామ సచివాలయంలో సేవలు స్తంభించడంతో ప్రజలు రావడం మానేశారు. ఇదే సచివాలయానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రోజూ 50 నుంచి వంద మంది వరకు వచ్చేవారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే వివిధ సేవలు పొందేవారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, ఆర్బీకేలు కళకళలాడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. హామీలు గాలికొదిలేసి ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తోంది.

కనిపించని అభివృద్ధి పనులు

కనిపించని అభివృద్ధి పనులు