
బాబుకు వెన్నతో పెట్టిన విద్య
వెన్నుపోటు రాజకీయాలు
● ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా మోసం ● కూటమి అరాచకాలు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● జూన్ 4న వెన్నుపోటు దినంగా పరిగణించుకుందాం ● నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ● భూమన పిలుపు
పార్టీ శ్రేణుల సమావేశంలో
మాట్లాడుతున్న భూమన కరుణాకరరెడ్డి
సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులు
తిరుపతి మంగళం : నమ్మిన వాళ్లను నట్టేటముంచి వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ అధికార దాహంతో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్న వెన్నుపోటుదారుడు చంద్రబాబు అని గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం చంద్రబాబు నైజమన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు వరగపెట్టిందేమీలేదన్నారు. గత ఎన్నికల్లో జగనన్న కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తానని ప్రజలను మరోసారి వంచించి అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణించడం జరిగిందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణించి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం మేయర్ శిరీష మాట్లాడారు. చంద్రబాబుకు అధికారం తప్ప ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్టదన్నారు. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేత జయచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, కార్పొరేటర్లు పుల్లూరు అమరనాఽథ్‌రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, కోటూరు ఆంజినేయులు, అనీష్‌రాయల్, ఆరణి సంధ్య, కోటేశ్వరమ్మ, పుణీత, ఆదిలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాబుకు వెన్నతో పెట్టిన విద్య