
ప్రజాస్వామ్యానికి
కాకాణి అరెస్ట్
● వెంకటగిరిలో ఉద్రిక్తత ● భారీగా తరలివచ్చిన అభిమానులు ● 144 సెక్షన్ అమలు ● అక్రమ అరెస్ట్‌ను ఖండించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కాలకేయ కూటమి రెడ్‌బుక్ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. హామీలు గాలికొదిలి అక్రమ అరెస్ట్‌ల పర్వం నిరాటంకంగా కొనసాగుతోంది. ఏదో ఒక కేసులో ఇరికించి వైఎస్సార్‌సీపీలోని కీలక నేతలను జైలుకు పంపడం రివాజుగా మారుతోంది. ఇలాంటిదే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మైనింగ్ వ్యవహారంలో రెండు నెలలుగా టార్గెట్ చేసి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్ చేయడం విమర్శలకు తావిస్తోంది. వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్నారన్న సమాచారంతో అభిమాన కెరటం ఎగసిపడింది. ప్రజాప్రతినిధులు, అభిమానులతో వెంకటగిరి పట్టణం కిక్కిరిసింది. 144 సెక్షన్ అమలు నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
కాకాణి అరెస్టుతో జనసంద్రమైన వెంకటగిరి
కొండంత అభిమానం
కాకాణి అక్రమ అరెస్టుతో వెంకటగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నుంచి అభిమానులు, నేతలు భారీగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా వైఎస్సార్‌సీపీ అభిమానులే దర్శనమిచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గూడూరు డీఏస్పీ గీతాకుమారి నేతృత్వంలో వెంకటగిరి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వెంకటగిరి (సైదాపురం): ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. అనవసరమైన కేసుల్లో ఇరికించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని జైలుకు పంపారు. సోమవా రం ఆయన్ను వెంకటగిరి కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సోమవారం తెల్లవారు జామునే తన నివాసానికి చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి చేరుకుని కాకాణి అక్రమ రెస్టును ఖండించారు. అక్కడి నుంచి నేతలు, కార్యకర్తలు వెంకటగిరి కోర్టుకు బయల్దేరారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, కోర్టు ప్రాంగణంలోకి వెళ్లరాదని పోలీసులు అడ్డుకున్నారు. ఆపై కొందరు ముఖ్య నేతలను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించారు. తర్వా త మాజీ మంత్రి అనీల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్ ఆనం విజయకుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మె ల్యే సంజీవయ్యతోపాటు పలువురు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రముఖులు కోర్టు వద్దకు చేరుకున్నారు.
కిక్కిరిసిన కోర్టు ప్రాంగణం
భారీ బందోబస్తు నడుమ నెల్లూరు నుంచి పోలీసు ఎస్కార్ట్ వాహనంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మధ్యాహ్నం 12.11 గంటలకు వెంకటగిరి కోర్టు ఆవరణానికి తీసుకొచ్చారు. తర్వాత ఆయన్ను న్యాయమూర్తి విష్మువర్మ ఎదుట హాజరు పరిచారు. సుమారు 3 గంటల పాటు వెంకటగిరి కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ నెలకొంది. చివరకు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కాకాణికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భారీ బందోబస్తు నడుమ నెల్లూరు సెంట్రల్ జైల్‌కు తరలించారు. మధ్యాహ్నం 3.20 గంటలకు కోర్టు భవనం నుంచి కిందకు వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడే ఉన్న వందలాది మంది అభిమానులు జై జగన్... జై గోవర్ధనన్న అంటూ నినాదాలు మిన్నంటించారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలివెళ్లారు.

ప్రజాస్వామ్యానికి

ప్రజాస్వామ్యానికి

ప్రజాస్వామ్యానికి